వరదలో చిక్కి.. బస్సు అదుపు తప్పి.. | - | Sakshi
Sakshi News home page

వరదలో చిక్కి.. బస్సు అదుపు తప్పి..

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

● పోలింగ్‌ సిబ్బంది అవస్థలు

● గోపాలపురం,

యెలిశెట్టివారిపాలెంలో ఘటనలు

సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి/కొత్తపేట: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పోలింగ్‌ సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని వరద చుట్టుముట్టడంతో నీటిలో చిక్కుకుపోయారు. అలాగే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు పంచాయతీ యెలిశెట్టివారిపాలెంలో బస్సు రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గోపాలపురంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. కేంద్రంలో బుధవారం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేపట్టారు. అయితే మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మార్కెట్‌ కమిటీ ఆవరణలోకి నీరు భారీగా చేరింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు, సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై యుద్ధప్రతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వై. మేఘ స్వరూప్‌ స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అగ్నిమాపక శాఖ, పోలీస్‌ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఎన్నికల విధుల అధికారులు, సిబ్బందిని బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

పోలింగ్‌ సిబ్బందికి తప్పిన ప్రమాదం

కొత్తపేట మండల పరిధిలోని బిళ్లకుర్రు రూటు నంబర్‌ 2 పోలింగ్‌ సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి కొత్తపేటలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి బస్సులో పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది పయనమయ్యారు. బిళ్లకుర్రు పంచాయతీ పరిధి యెలిశెట్టివారిపాలెంలో పీఎస్‌ల సిబ్బందిని, సామగ్రిని దించిన ఆ బస్సు కాలువ గట్టున ఇతర పీఎస్‌లకు వెళుతుండగా డేగలవారిపాలెం వంతెన వద్ద అదుపు తప్పి ఒక పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే సిబ్బందిని దిగిపోవాలని చెప్పడంతో ఒక్కొక్కరు జాగ్రత్తగా కిందకు దిగారు. వెంటనే సమీపంలో ఉన్న స్థానికులు స్పందించి బస్సు చక్రాలు మరింత కిందకు దిగబడిపోకుండా రాళ్లు, దుంగలు పెట్టారు. అనంతరం మరో బస్సులో సిబ్బందిని, పోలింగ్‌ సామగ్రిని తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement