ఒకప్పుడు రోజువారీ కూలితో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన సామాన్యుడికి ఇప్పుడు పూట గడవడమే కష్టంగా మారింది. తిండికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికే జేబుకు చిల్లు పడుతోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నలుగురు సభ్యులున్న కుటుంబంపై నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోంది. దీంతో కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోంది.
సాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. నెల వారీ ఆదాయంలో ఎక్కువ భాగం వాటి కొనుగోలుకే ఖర్చవుతుండటంతో కుటుంబాలను పోషించడం భారంగా మారుతోంది. ముఖ్యంగా బియ్యం ధరలు అందనంత ఎత్తుకు చేరడం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో కిలో సన్నబియ్యం రూ.45 నుంచి రూ.50 మధ్య లభించేది. ప్రస్తుతం అదే బియ్యాన్ని రకం, నాణ్యతను బట్టి కిలో రూ.75 నుంచి రూ.80 వరకు విక్రయిన్నారు. 25 కిలోల బస్తా ధర గత మూడు నెలల్లో రూ.600 మేర పెరిగి రూ.2,400 (సన్న రకం) దాటేసింది.
కొత్త ధరలతో దోపిడీ
మార్కెట్లో ప్రస్తుతం గత ఏడాది పండిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నప్పటికీ ధరలు మాత్రం తగ్గడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ధరలు, మిల్లింగ్ ఖర్చులు, రవాణా వ్యయం, నిల్వలు, మార్కెట్లో సరఫరా వంటి అంశాలు బియ్యం ధరలను ప్రభావితం చేయవచ్చు. అయితే ధరలు ఇంతలా పెరగడానికి అసలు కారణం మిల్లర్లు, వ్యాపారులతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు కావడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ ఏడాది కరువును సాకుగా చూపించి పాత బియ్యం ధరలు విపరీతంగా వ్యాపారులు పెంచేస్తున్నా ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు.
నెలకు రూ.5 వేల అదనపు భారం
నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. బియ్యం, నూనె, కూరగాయలు, పప్పులు, పంచదార, ఇతర వంట సరుకుల కొనుగోలుకు గతంతో పోలిస్తే అదనపు మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. ధరల పెరుగుదల, కుటుంబ వినియోగం, కొనుగోలు చేసే సరుకుల రకాన్ని బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య సంపాదించే కుటుంబాలు అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే.. మిగిలే మొత్తంతో ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు ఎలా భరించాలని లబోదిబోమంటున్నారు.
చర్యలు శూన్యం
అధికారంలోకి రాగానే ధరలను తగ్గించేస్తాం, ధరల రెక్కలు విరిచేస్తాం అని గొప్పగా చెప్పిన చంద్రబాబు ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి. రోజురోజుకీ సామాన్యుల వంటింట్లో ధరల మంట రేగుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు వాటి కారణాలను విశ్లేషించడం, సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం, అక్రమ నిల్వలను అరికట్టడం, అవసరమైన చోట మార్కెట్లో జోక్యం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అయితే, బియ్యం నుంచి కూరగాయల వరకు ధరలు పెరుగుతున్నా ప్రజలకు ఉపశమనం కలిగించే ఒక్కటంటే ఒక్క చర్యా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టలేదు. ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ, అక్రమ నిల్వలపై తనిఖీలు, సరఫరాలో అంతరాయాల నివారణ, ముఖ్యంగా మిల్లర్ల మాయాజాలంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోవడంతో సామాన్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
అన్ని వస్తువులూ ౖపైపెకే..
గత మూడు నెలల్లో కిలో నూనె ధర సుమారు రూ.40 మేర పెరిగి రూ.190 దాటేయడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వంటకు రోజూ నూనె అవసరం కావడంతో ధరల పెరుగుదల నేరుగా నెలవారీ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది.
మరోవైపు పంచదార, బెల్లం ధరలు కూడా వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. టీ, కాఫీ నుంచి ఇంట్లో తయారు చేసుకునే అల్పాహారాలు, పండగల వంటకాల వరకు వీటి వినియోగం ఉంటుంది. వీటి ధరలు పెరిగితే చిన్న మొత్తాలుగా కనిపించినా నెలాఖరుకు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.
రోజువారీ వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లి (రూ.60), పచ్చిమిర్చి(రూ.80), వెల్లుల్లి(రూ.250–రూ.320)తో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. గతంలో తక్కువ మొత్తంతో సంచి నిండా కూరగాయలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అదే మొత్తంతో అవసరమైన సరుకులన్నీ కొనడం సాధ్యం కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
సామాన్యుడి బడ్జెట్కు ధరల షాక్
రూ.80కి చేరిన కిలో సన్నబియ్యం
రూ.190 దాటేసిన నూనె ప్యాకెట్
ఉల్లి, పచ్చిమిర్చి, కూరగాయలదీ అదేదారి
ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
ఉడకని ధరణి బియ్యం
ధరణి పేరిట బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.49 చొప్పున, కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఉన్నతాధికారులు గొప్పగా ప్రకటించారు. ధరణి బీపీటీ బియ్యం 26 కిలోల బస్తా రూ.1,274కు, కేఎన్ఎం రకం బియ్యం 26 కిలోల బస్తా రూ.1,300కు లభిస్తాయని పేర్కొన్నారు. నగరంలోని ఏడు రైతు బజార్లలో (గణేష్ చౌక్, నటరాజ్ సెంటర్, క్వారీ సెంటర్, శంభునగర్, వీఎల్పురం, వై జంక్షన్, లాలాచెరువు) ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయలేదు. మరోవైపు ఎవరైనా ఏదోలా తెలుసుకుని వచ్చినా ఆయా రైతుబజార్లలోని దుకాణాలు మూసేసి ఉంటున్నాయి. ఒకవేళ ఎక్కడైనా తెరిచి ఉంచినప్పటికీ కొనుక్కునే బస్తాలోని బియ్యం ఎలా ఉంటాయో చూపించే పరిస్థితి లేదు. ఇప్పటికే కొనుగోలు చేసిన వారైతే ఆ బియ్యం సరిగ్గా ఉడకడం లేదని, అన్నం ముద్దలా మారిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈ దుకాణాలకు సన్నబియ్యం పేరిట మామూలు బియ్యాన్నే మిల్లర్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


