పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు ఎం.గౌతమి, వ్యయ పరిశీలకులు నరేందిరన్‌ జీజీ ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వ్యయాల పర్యవేక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలన్నారు. అవసరానికి అనుగుణంగా అదనపు పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నోడల్‌ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ మూడు పురపాలక సంఘాల్లో 66 హైపర్‌ సెన్సిటివ్‌, 36 సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు.

వ్యయ పరిమితులు

విధిగా పాటించాలి

కపిలేశ్వరపురం (మండపేట): స్థానిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులు, ఇతర నియమ నిబంధనలను పాటించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేందిరన్‌ అన్నారు. మండపేట పట్టణంలోని అన్నపూర్ణ హైస్కూల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. స్థానిక పరిస్థితులను మండపేట అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అథారిటీ, మున్సిపల్‌ కమిషనర్‌ తూబాటి వెంకట రంగారావు, రాజమహేంద్రవరం తూర్పు డీఎస్పీ విద్య వివరించారు. మద్యం, నగదు, ఇతర ప్రలోభాలపై నిఘా ఉంచాలని మున్సిపల్‌ అధికారులను ఆయన ఆదేశించారు.

రేపటి పీజీఆర్‌ఎస్‌ రద్దు

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి డిసెంబర్‌ 2వ తేదీ వరకు అమల్లో ఉండనున్న నేపథ్యంలో అప్పటి వరకు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీపీఠం.. ఆధ్యాత్మిక శోభితం

కాకినాడ రూరల్‌: దసరా ఉత్సవాల్లో దుర్గాష్టమి రోజు ఆదివారం రమణయ్యపేటలోని శ్రీపీఠం భక్తజన సంద్రంగా మారింది. మహాశక్తి యాగంలో భాగంగా కుంకుమార్చనలతో పాటు విశేష పూజలను పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2030 నాటికి వెయ్యి కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేసే లక్ష్యంతో మహాశక్తి యాగం ప్రారంభించగా, ఈ సంవత్సరంతో 400 కోట్లు పూర్తవ్వనున్నాయి. 8వ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మూడు సార్లు లలితా సహస్ర నామాల పారాయణ చేయించడంతో 74 కోట్లకు కుంకుమార్చనలు చేరుకున్నాయి. మరో రెండో రోజుల్లో వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తవుతాయని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఐశ్వర్య పూజలో భాగంగా చండీ సప్తశతిలోని కవచం, అర్గళం, కీలకం, స్తోత్ర చతుష్టయం, సిద్ధ కుంజికా స్తోత్రం తదితర పారాయణ చేశారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి, దాని కాంతిలో దర్శనమిచ్చే అమ్మవారి రూపం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పూజ నిర్వహించినట్టు పరిపూర్ణానంద స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement