ఓటమి భయంతోనే కూటమి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే కూటమి కుట్రలు

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు

● మాజీ హోంమంత్రి వనిత అధ్యక్షతన యర్నగూడెంలో సమావేశం

దేవరపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారని, వారిలోని విభేదాలు కూడా స్పష్టంగా బయటపడుతున్నాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. దేవరపల్లి మండలం యర్నగూడెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ హోం మంత్రి, కో ఆర్డినేటర్‌ తానేటి వనిత అధ్యక్షతన ఆదివారం మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపిక, విజయవకాశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

సమష్టిగా పోరాటం

వేణు మాట్లాడుతూ కొవ్వూరులో టీడీపీ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా ఒకరు నామినేషన్‌ వేస్తే, ఆ పార్టీ అధిష్టానం మరో పేరు పంపించిందని, జనసేన పార్టీ వేరేగా పోటీ పెడుతున్నారని తెలిపారు. 30 నెలల చంద్రబాబు పాలనలో చేసిన అప్పు రూ. 4.15 లక్షల కోట్లు దాటిందన్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికపై గ్రామ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ప్రతి గ్రామంలో పోటీ ఉండాలని, ఎక్కడా ఏకగ్రీవం కారాదని సూచించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్‌, మాజీ ఎంపీపీ కేవీకే దుర్గారావు, మండల మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి, మాజీ ఏఎంసీ చైర్మన్లు గన్నమని జనార్దనరావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురంలో...

గోపాలపురంలోని పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు వెలగా శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యకర్తలు, నాయకుల సమీక్ష సమావేశంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. గ్రామ స్థాయిలో అందరూ కలిసి ఒకే అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆమె సూచించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు .సమావేశంలో పార్టీ నాయకులు కూసం రామోహన్‌రెడ్డి, ఇళ్ల భాస్కరరావు, వల్లభనేని సత్యనారాయణ, దుగ్గిరాల రమేష్‌, ముల్లంగి శ్యామ్‌ సుందరరెడ్డి, షేక్‌ ఖాదర్‌ వలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement