● చైర్మన్ స్థానాలకు 42,
కౌన్సిలర్లకు 494 దాఖలు
● నేడు పరిశీలన, బుధవారం తుది జాబితా
సాక్షి, రాజమహేంద్రవరం: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. తొలిరోజు శుక్రవారం ఎవరూ ముందుకు రాకపోగా, రెండో రోజు శనివారం కొందరు నామినేషన్లు వేశారు. చివరి రోజైన ఆదివారం నామినేషన్ల జోరు కనిపించింది. మండపేట మున్సిపల్ చైర్మన్ పదవికి అత్యధికంగా 19 సెట్లు, కొవ్వూరులో 13, నిడదవోలులో 10 సెట్లు దాఖలయ్యాయి. వీటి పరిధిలోని 96 వార్డులకు మొత్తంగా 494 సెట్ల నామినేషన్లు వేశారు. ఈ పత్రాలను అధికారులు సోమవారం పరిశీలించనున్నారు. అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
● కొవ్వూరు మున్సిపాలిటీకి చైర్పర్సన్ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ తరఫున గండ్రోతు అంజలీదేవి, గంటా స్వాతి కిరణ్, ఏలూరు విజయలక్ష్మి రెండేసి సెట్లు నామినేషన్లు వేయగా, గండ్రోతు దుర్గా లావణ్య ఒక సెట్ వేశారు. టీడీపీ తరఫున ఇప్పటికే కంఠమని విజయలక్ష్మి మూడు సెట్లు నామినేషన్లు వేశారు. అయితే టీడీపీ అధిష్టానం జొన్నలగడ్డ రాధారాణి పేరు ప్రకటించడంతో గందరగోళం నెలకొని కొవ్వూరులోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బుజ్జగించారో, లేక బెదిరించారో తెలియదు కానీ అధిష్టానం జాబితాలో పేరున్నప్పటికీ రాధారాణి నామినేషన్ వేయలేదు.
● నిడదవోలు మున్సిపల్ చైర్పర్సన్గా వైఎస్సార్ సీపీ తరఫున ఆంధ్రాబ్యాంకు విశ్రాంత మేనేజర్, రోటరీ క్లబ్ మాజీ చైర్ పర్సన్ వేదాల విజయలక్ష్మి మూడు సెట్లు, గోళ్ల దివ్య, గెద్దాడ విమల, చెట్టే రాజకుమారి ఒక సెట్ చొప్పున నామినేషన్లు వేశారు. కూటమి పొత్తులో భాగంగా జనసేన నుంచి కళ్లెం జ్యోతి రెండు సెట్లు వేశారు. కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్య్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్ వేశారు.
● మండపేట చైర్మన్ కోసం వైఎస్సార్ సీపీ నుంచి ప్రముఖ వైద్యుడు కాట్రావతు రాము రెండు, టేకుముడి శ్రీను రెండు, యాండ్ర ప్రభాకరరావు ఒక సెట్ నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి వేగుళ్ల అజయ్ కుమార్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి రెండు, నవతరం పార్టీ నుంచి రెండు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
మండపేటలో నామినేషన్ పత్రాలు అందజేస్తున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము
కొవ్వూరులో నామినేషన్ వేయడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి గంట్రోతు అంజలీదేవి, నాయకులు
విద్యావేత డాక్టర్ రాము
కపిలేశ్వరపురం(మండపేట): మండపేట మున్సిపల్ చైర్మన్ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పట్టణానికి చెందిన డాక్టర్ కె.రాము ఎంపికయ్యారు. దీంతో ఐదు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. విద్యావేత్త, సేవాగుణం కలిగిన డాక్టర్ రాము ఎంపికపై సానుకూలత వ్యక్తమవుతోంది. ఆయన పేరును వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రకటించారు. పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నియోజకవర్గంలోని పార్టీ ప్రముఖ నాయకులకు డాక్టర్ రాము కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సీనియర్ నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, యువనేత తోట పృథ్వీరాజ్, నాయకులు జిన్నూరి సాయిబాబా, పలివెల సుధాకర్, పెంకే గంగాధర్, సలాది వీరబాబు, సూరంపూడి సత్యప్రసాద్, యరమాటి వెంకన్నబాబులతో కలిసి రాము నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రాము విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ తోట తదితర నాయకుల బాటలో నడుస్తూ ముందుకు సాగుతానన్నారు.
చైర్మన్ స్థానాలకు నామినేషన్లు
మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కూటమి ఇతరులు మొత్తం
కొవ్వూరు 7 3 3 13
నిడదవోలు 6 2 2 10
మండపేట 5 6 8 19
వార్డు కౌన్సిలర్ స్థానాలకు..
మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కూటమి ఇతరులు మొత్తం
కొవ్వూరు 40 90 21 151
నిడదవోలు 66 75 17 158
మండపేట 93 90 02 185


