● 50 నుంచి 72కి పెరిగిన డివిజన్లు
● 120 చదరపు కిలోమీటర్లకు విస్తీర్ణం
● 5,13,299 మంది జనాభా
రాజమహేంద్రవరం సిటీ: మన రాజమహేంద్రవరం మహా నగరంగా ఆవిర్భవించింది. చుట్టు పక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేసి, మహా రాజమహేంద్రవరంగా తయారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసింది. ఈ వివరాలను నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదివారం వెల్లడించారు. ఇప్పటి వరకూ 50 డివిజన్లతో కొనసాగుతున్న రాజమహేంద్రవరం నగరం 11 విలీన గ్రామ పంచాయతీలను కలుపుకొని 72 డివిజన్లకు రూపాంతరం చెందింది.
● 2011 జనాభా ప్రకారం రాజమహేంద్రవరంలోని 50 డివిజన్లలో 3,43,903 మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు చుట్టు పక్కల 11 గ్రామ పంచాయతీల్లోని 1,69,396 మంది కలవడంతో జనాభా 5,13,299 మందికి చేరుకుంది.
● రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో నగరం విస్తరించింది. గతంలో విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లు ఉండగా తాజాగా వేమగిరి, రాజవోలు, హుకుంపేట, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, పిడింగొయ్యి, కాతేరు, తొర్రేడు, వెంకటనగరం, లాలాచెరువు గ్రామ పంచాయతీలు కలవడంతో 120 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది.
● మహా నగరంగా 72 డివిజన్లతో మార్పు చేసుకోవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. అధికారులు డివిజన్ సరిహద్దుల మేరకు ఓటర్ల నిర్ధారణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
● తాజాగా మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రతి డివిజన్లో 8 వేల మంది లోపు ఓటర్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
● ప్రభుత్వం రాజపత్రం విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. డివిజన్లలో ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. త్వరలో ఓటర్లను నిర్ధారణ పూర్తయిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ,రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకటిస్తామన్నారు.


