కథ మలుపు తిరిగింది! | - | Sakshi
Sakshi News home page

కథ మలుపు తిరిగింది!

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

సాక్షి, రాజమహేంద్రవరం: అనుకున్నదొకటి..అయ్యిందొకటి అన్నట్లు, రాజమహేంద్రవరం నగర మేయర్‌ పీఠం చుట్టూ సాగిన రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ సారైనా మేయర్‌ పీఠం కోసం పోటీ చేయాలని కలలు కన్న టీడీపీ నాయకులకు నిరాశే మిగిలింది. జనసేనతో పొత్తు ఒప్పందం ఉన్నప్పటికీ తొలుత తమలో తామే పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు గుప్పించారు. ఇంతలో ఎస్సీ రిజర్వేషన్‌ ప్రకటనతో పలువురి ఆశలు ఆవిరయ్యాయి. ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలన్న ఓ వర్గం ఆశలు గల్లంతయ్యాయి. ఇంతలో రిజర్వేషన్‌ అనుకూలించడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓ డాక్టర్‌తో పాటు టీడీపీ సీనియర్‌ నాయకుడికి చంద్రబాబు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. మేయర్‌ స్థానం బీజేపీకి కేటాయించడంతో టీడీపీ ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది.

మాటల నుంచి మౌనం వైపు..

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటనతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. సమీప గ్రామాల విలీనంతో గ్రేటర్‌ రాజమహేంద్రవరం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుండటంతో నగర రాజకీయాల్లోనూ సమీకరణాలు మారుతున్నాయి. విస్తరించనున్న నగరంలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో టీడీపీలోని పలువురు నాయకులు ముందుగానే తమ మనసులో మాట బయటపెట్టారు. తామే పోటీ చేస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటును వదులుకున్నందున మేయర్‌ పీఠాన్ని తమకు కేటాయించాలంటూ టీడీపీతో గతంలో కుదిరిన ఒప్పందాన్ని జనసేన నేతలు ప్రస్తావించారు. ఆ ఒప్పందం ప్రకారం ఈసారి తమకే అవకాశం దక్కుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో మేయర్‌ అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా సాగింది.

ఆశావహులకు మొదటి ట్విస్ట్‌

మేయర్‌ పీఠానికి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న నాయకులకు రిజర్వేషన్ల ప్రకటన తొలి షాక్‌ ఇచ్చింది. ఈ స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ కావడంతో అప్పటి వరకు పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు చేసిన పలువురి ఆశలు గల్లంతయ్యాయి. తమ రాజకీయ లెక్కలు తలకిందులు కావడంతో వారు ఒక్కసారిగా మౌనం వహించారు. అయితే ఎస్సీ రిజర్వేషన్‌ కావడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీలోని ఓ సీనియర్‌ నాయకుడితో పాటు నగరంలోని ప్రముఖ వైద్యుడు మేయర్‌ పదవికి పోటీ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని ప్రయత్నించారు. రిజర్వేషన్‌ తమకు అనుకూలంగా మారడంతో పార్టీ నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని భావించారు.

చంద్రబాబు నిర్ణయంతో బిగ్‌ షాక్‌

డాక్టర్‌తో పాటు సీనియర్‌ నాయకుడు పోటీకి తమకు అవకాశం ఖాయమని భావిస్తున్న సమయంలోనే కథ మరో మలుపు తిరిగింది. కూటమి పొత్తుల సమీకరణాల్లో భాగంగా రాజమహేంద్రవరం మేయర్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ కారణంగా కొందరు ఇప్పటికే వెనక్కి తగ్గగా.. ఆ సామాజిక వర్గం నుంచి పోటీకి సిద్ధమైన నాయకులకు ఇప్పుడు పార్టీ పరంగానే అవకాశం లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీనే నమ్ముకుని పనిచేస్తున్నామని, పార్టీ కోసం కష్టపడిన తమకు పదవుల విషయంలోనూ అన్యాయమే జరిగిందని పలువురు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేయర్‌ పీఠానికి ఎలాగైనా పోటీ చేయాలన్న ఆశతో ఉన్న డాక్టర్‌ బీజేపీ అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికోసం కమలదళం పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినా, ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సానుకూల సంకేతాలు రాలేదని సమాచారం. మొత్తానికి రిజర్వేషన్ల ప్రకటనతో కొందరి ఆశలు ఆవిరైతే.. పొత్తుల నిర్ణయంతో మిగిలిన ఆశావహులకూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

రాజమహేంద్రవరం

మేయర్‌ స్థానంపై ట్విస్ట్‌లు

బాబు ప్రకటనలతో

టీడీపీ ఆశావహులకు ఝలక్‌

తొలుత మేమంటే మేమంటూ

వరుస ప్రకటనలు

పొత్తులో భాగంగా

బీజేపీకి కేటాయించడంతో మరో షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement