ఖర్చు మించితే కొరడా | - | Sakshi
Sakshi News home page

ఖర్చు మించితే కొరడా

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

● ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాల్సిందే

● నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు మించితే కొరడా తప్పదు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు పాటించాల్సిందే.. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి సూచించారు. ఈ మేరకు ఆమె పలు సూచనలు చేశారు. జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, మండపేట పట్టణ స్థానిక సంస్థల పరిధితో పాటు మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీలు), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ), గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించాలి.

● గ్రామ పంచాయతీల్లో 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే సర్పంచ్‌ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షలు, వార్డు సభ్యుడు రూ.లక్ష వరకు, 10 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.60 వేల వరకు ఖర్చు చేయవచ్చు.

● ఎంపీటీసీ అభ్యర్థికి రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థికి రూ.8 లక్షల పరిమితి సూచించారు.

● పట్టణ స్థానిక సంస్థల్లో చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులకు వర్తించే పరిమితులు సంబంధిత మున్సిపాలిటీ వర్గీకరణ, వార్డు స్థాయి, రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం వర్తిస్తాయి.

రోజువారీ ఖర్చుల వివరాల నమోదు

పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే తేదీ వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చులను నిర్దేశిత రిజిస్టర్‌లో రోజువారీగా నమోదు చేయాలి. ప్రచార సామగ్రి, కరపత్రాలు, బ్యానర్లు, వాహనాలు, సభలు, సమావేశాలు, ఇతర ప్రచార కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చుల వివరాలు, బిల్లులు, రశీదులు భద్రపరచాలి. ఎన్నికల వ్యయ ఖాతాను సంబంధిత ఎన్నికల అధికారి సూచించిన విధానంలో, గడువులోగా సమర్పించాలి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు, మద్యం, బహుమతులు, వస్తువులు, ఇతర ప్రలోభాలు పంపిణీ చేయడం నిషేధం.

దుర్వినియోగం చేయరాదు

ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు, అతిథి గృహాలు, ప్రభుత్వ సిబ్బంది ప్రజాధనంతో నిర్వహించే వనరులను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించరాదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న ప్రాంతాల్లో కొత్త పథకాల ప్రకటనలు, ఓటర్లను ప్రభావితం చేసే ప్రత్యేక ప్రయోజనాల పంపిణీ, నిషేధిత శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రకటనలు చేయరాదు.

అనుమతులు తప్పనిసరి

ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. లౌడ్‌ స్పీకర్ల వినియోగంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిషేధానికి సంబంధించిన నిబంధనలను పాటించాలి. ప్రైవేటు ఇళ్లు, ప్రహరీలు, భవనాలపై యజమాని అనుమతి లేకుండా పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘం సూచనలను పాటించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement