సీ్త్ర సహనానికి పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

సీ్త్ర సహనానికి పరీక్ష!

Aug 29 2026 12:11 AM | Updated on Aug 29 2026 12:11 AM

పరిమిత బస్సుల్లో అపరిమిత ప్రయాణాలు

మౌలిక వసతులు పెంచని ప్రభుత్వం

అవస్థలు పడుతున్న సాధారణ ప్రజలు

కపిలేశ్వరపురం: గత ఏడాది ఆగస్టు 15న సీ్త్రశక్తి పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం నేడు అస్తవ్యస్తంగా మారింది. ఆడపడుచుల సంక్షేమమే మా ప్రాధాన్యం అని ఘనంగా చెప్పుకొని ప్రారంభించిన ఈ పథకంలో అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ వంటి అనేక సర్వీసులను మినహాయించి కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు మాత్రం అనుమతించి వారిని అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారు.

ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రపురంలో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు. తీరా చూస్తే నలభై మంది పట్టే బస్సులో 70 మంది దాకా కుక్కేసి నడిపేస్తున్నారు. మౌలిక వసతులు ఏ మాత్రం పెంచకుండా ప్రారంభించిన ఈ పథకాన్ని ఆయా బస్సుల డ్రైవర్లు సైతం పట్టించుకోవడం లేదు. పలు స్టాప్‌లలో ప్రయాణికులు ఉన్నా ఆపకుండా వెళ్లిపోతుండడం శోచనీయం.

దివ్యాంగులకు దిక్కెవరు..

సీ్త్రశక్తి పథకం అమలయ్యాక దివ్యాంగులకు రిజర్వు చేసిన సీట్లు సైతం వారికి దొరకడం లేదు. దీంతో వారు బస్సు ఎక్కడానికి, ఎక్కాక సీటు సంపాదించడానికి చాలా అవస్థలు పడుతున్నారు.

ఎక్కడ చూసినా ఫుట్‌బోర్డు ప్రయాణాలే..

రావులపాలెం డిపో పరిధిలో శనివారం వచ్చిందంటే ఉమ్మడి జిల్లాలోని చాలా మంది భక్తులు వాడపల్లికి వెళ్లేందుకు ఇక్కడికే వస్తారు. వారి డిమాండ్‌కు తగ్గ బస్సులు లేకపోవడంతో చాలా మంది భక్తులతో పాటు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై ఒక్క కాలు పెట్టడానికి చోటున్నా సరిపోతుందన్నట్టు వేలాడుతూ వెళ్తున్నారు.

అత్త మీద కోపం దుత్తమీద..

ప్రయాణ అవస్థలను ఓర్చుకోలేని ప్రయాణికులు ప్రభుత్వం చూపాల్సిన కోపాన్ని ఎదురుగా కనపడుతున్న కండక్టర్‌, లేదా డ్రైవర్‌పై చూపుతున్నారు. 2025 సెప్టెంబర్‌ 16న గోకవరం బస్‌స్టాండ్‌లో టిక్కెట్‌ తీసుకునే క్రమంలో జరిగిన వాగ్వాదంలో కండక్టరు చేతి వేలు విరిగిపోయింది. కోరుమిల్లిలో జరిగిన వాగ్వాదంలో కండక్టర్‌ కాలు విరగ్గొట్టేశారు. వెలుగు చూడని ఇటువంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి.

వ్యాపారాలపై ప్రభావం..

సీ్త్ర శక్తి పథకంతో మహిళల రాకపోకలు పెరిగి, కొనుగోళ్లు పెరిగి, వ్యాపారాలు లాభిస్తాయని చాలా మంది భావించారు. తీరా చూస్తే ఓ మోస్తరు సరుకులను కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర దూరపు ప్రాంతాలకు వెళ్లి కొంటున్నారు.

అసలు ఎగ్గొట్టి కొసరు కల్పించి..

ఉచిత ప్రయాణాలతో మహిళలకు బస్సు చార్జీలు మిగులుతున్నాయి తప్ప వారి కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని పలువురు అంటున్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ బకాయిలు చెల్లించలేదు. డ్వాక్రా రుణాలు, రాయితీలు ఇతర ప్రయోజనాల ఊసే లేదు. వీటిని ప్రశ్నించకుండా ఉండేందుకు సీ్త్రశక్తి పథకాన్ని కొనసాగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement