ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురి అరెస్టు
కోరుకొండ: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో నార్త్ జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణాపై అందిన సమాచారం మేరకు బూరుగుపూడి జంక్షన్‌లోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు డిక్కీలో 3 బస్తాల్లో నింపిన 61 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సరకుతో పాటు కారులోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తాండ, బాగవత్ ప్రాంతానికి చెందిన సదకత్, బార్కండి శామ్లి జిల్లాకు చెందిన సదాబ్, సల్మాన్‌లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.30 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జీవన తెలిపారు. ఈగల్ టీమ్ సహకారంతోనే గంజాయి రవాణాను అడ్డుకోగలిగామని ఆమె తెలిపారు. ఈ కేసులో కృషి చేసిన కానిస్టేబుల్స్ రవికిరణ్, ప్రకాష్ రెడ్డి, రామచంద్రరావు, సుబ్రహ్మణ్యంలకు ఆమె రివార్డులు అందజే శారు. సమావేశంలో సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి, ఎస్సై సీహెచ్‌వీ రమేష్ పాల్గొన్నారు.
చోరీ సొత్తు స్వాధీనం
కొత్తపేట: స్థానిక ఆర్‌ఎస్ నగర్‌లో నివసిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలో చోరీకి గురైన సుమారు రూ 25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి 20వ తేదీ ఉదయం 8 గంటలకు వచ్చారు. వారు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం, లోపలి బీరువా పగలగొట్టబడి అందులోని సుమారు 23 కాసుల బంగారు, సుమారు 880 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. రాంబాబు ఫిర్యాదు మేరకు డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో అమలాపురం సీసీఎస్ సీఐ ఎన్ కొండయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ దర్యాప్తు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలివెల వంతెన వద్ద చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నగరపు ఈశ్వరరావు అలియాస్ సింగనపూడి ఈశ్వరరావును సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి, అతని నుంచి చోరీ సొత్తు (సుమారు రూ.25 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అతడు ఉపయోగించిన మోటార్ సైకిలు, రెండు ఇనుప రాడ్‌లను సైతం స్వాధీనం చేసుకుని అతడిని కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ అతడికి 15 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం
సఖినేటిపల్లి: స్థానిక క్షత్రియ కల్యాణ మండపం సమీపంలో గోదావరి ఒడ్డున శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు పోలీసుల తెలియజేయాలని, సోషల్ మీడియా వేదికగా కూడా నెట్‌జన్లు కోరారు. మృతురాలి ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.


