కాకినాడ రూరల్: చేపల వేటకు వెళ్లి గల్లంతై తిరిగి వచ్చిన ఓడలరేవు మత్స్యకారులు శుక్రవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. వారికి రమణయ్యపేటలో సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో వారు స్నానాలు చేసి అల్పాహారం తీసుకున్న తరువాత కోనసీమ జిల్లాకు పయనమయ్యారు. వారికి ఆశ్రయం ఇచ్చి, వారితో పాటు వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మత్స్యకారులు ఇద్దరినీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కొపనాతి రామకృష్ణ, సంగాడి తాతారావు, కర్రి రాముడు, కొల్లాడి ఏసుదాసు, శ్రీనుబాబు, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు మాట్లాడుతూ దేవుడి దయవల్ల తాము ప్రాణాలతో బయటపడ్డామన్నారు. సుముద్రంలో బోటు ఇంజిన్ చెడిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, తీసుకువెళ్లిన రేషన్‌ను పొదుపుగా వాడుకుని, మాలోని ఇద్దరికి అన్నం పెట్టి గంజి తాగేవాళ్లమని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లోని శంకర జెట్టీ వద్ద లభ్యమైన తమను అధికారులు కాకినాడ తీసుకువచ్చారని తెలియజేశారు.


