కరిచర్లగూడెంలో పెద్దపులి! | - | Sakshi
Sakshi News home page

కరిచర్లగూడెంలో పెద్దపులి!

Jul 29 2026 12:16 AM | Updated on Jul 29 2026 12:16 AM

పామాయిల్‌ తోటలో మకాం

పొలాల్లో ప్రత్యేక బృందాలతో

రెస్క్యూ ఆపరేషన్‌

దేవరపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు కొంత కాలంగా దడ పుట్టిస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు గోపాలపురం మండలం కరిచర్లగూడెం, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల మధ్య పొలాలకు చేరుకుంది. సోమవారం మండలంలోని కరగపాడు, బుచ్చియపాలెం, నందిగూడెం ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్టు పాదముద్రల ద్వారా గుర్తించిన అటవీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీ శాఖ రాజమహేంద్రవరం రేజ్‌ అధికారి దావీద్‌ రాజు ఆధ్వర్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. 60 మంది సిబ్బందిని 5 బృందాలుగా పంపి గాలింపు చేపట్టారు. పులి మెడలోని ట్రాకర్‌ ద్వారా దాని కదలికలను గమనిస్తున్నారు. మంగళవారం ఉదయం నందిగూడెం అటవీ ప్రాతం నుంచి తొక్కిరెడ్డిగూడెం మీదుగా కరిచర్లగూడెం బొల్లేరు చెరువు సమీపంలోకి చేరుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆవుదూడను చంపి సమీపంలోని కొబ్బరి, కోకో, ఆయిల్‌పామ్‌ తోటల్లోకి లాక్కెళ్లినట్టు గుర్తించిన అధికారులు తోటను చుట్టిముట్టి అక్కడ బోను ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్‌, డ్రోన్‌ సహాయంతో పులిని పట్టుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీని కోసం శ్రీశైలం టైగర్‌ టీం, జిల్లా హనుమాన్‌ టీం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 మంది సిబ్బందిని ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు.

సీసీ ప్లీజ్‌.. డ్రైన్‌ కూలింది..!

రాయవరం: పనోళ్లు పందిరేస్తే పిచుకలు కూల్చేశాయన్న సామెతలా ఇంకా ప్రారంభించకుండానే సీసీ డ్రైన్‌ గోడ కొద్దిపాటి ప్రవాహానికే కూలిపోయింది. మండలంలోని కురకాళ్లపల్లిలో రూ.44 లక్షల ఉపాధి నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్‌ నిర్మిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆంజనేయుడి గుడి వద్ద నుంచి 220 మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో రూ.22 లక్షల అంచనాతో సీసీ రోడ్డు, డ్రైన్‌ నిర్మించారు. సోమవారం రాత్రి వచ్చిన కొద్దిపాటి వర్షానికి డ్రైన్‌లో నీటి ప్రవాహానికి ఒక వైపు రక్షణ గోడ 20 మీటర్ల మేర కూలిపోయింది. అధికారుల పర్యవేక్షణ లేక పోవడం, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా నిర్మించడం వల్లే ఇలా కూలిపోయిందని స్థానిక వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ మండల కన్వీనర్‌ పిల్లి ప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడం వల్లే డ్రైనేజీ గోడ కూలిపోయిందని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు కుడుపూడి శ్రీనివాస్‌ ఆక్షేపించారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. దీనిపై ఇన్‌చార్జి మండల ఇంజినీరింగ్‌ అధికారి ఎ.మధుసూదన్‌ ‘సాక్షి’ వివరణ కోరగా డ్రైనేజీ గోడ కూలడం వాస్తవమేనన్నారు. నీటి ప్రవాహం ఒకేసారి రావడం, డ్రైన్‌ గోడ పక్కన బెర్మ్‌ లేక పోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. పనులు చేసిన కాంట్రాక్టరుతో మళ్లీ దానిని నిర్మిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement