ఉపాధి హామీకి.. రామ్‌రామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీకి.. రామ్‌రామ్‌

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

కపిలేశ్వరపురం/రాయవరం: రెండు దశాబ్దాలుగా గ్రామీణ నిరు పేదలకు ఉపాధి కల్పన.. వలసల నివారణకు ఎంతో ఉపయోగపడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పేరు బుధవారం నుంచి మారుతోంది. ఇక నుంచి వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (వీబీ జీ రామ్‌జీ) పేరిట కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన పాత లక్ష్యాన్ని 100 శాతం మంగళవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపేదిగా ఉందని వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ ఉపాధి హామీ

అందరూ ఉపాధి హామీ పథకంగా పిలుచుకునే ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ 2006లో ప్రారంభమైంది. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించాలనే డిమాండుతో రెండు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఈ పథకం అమలు ఉద్యమంలా సాగింది. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మరో అడుగు ముందుకేసి, వ్యవసాయ అనుబంధ, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే కూలీలతో చేపట్టే వాటికి మొదటి స్థానం ఇచ్చారు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి రోజూ లక్షలాది మంది ఉపాధి పొందేవారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి పాలనలో ఈ పథకాన్ని అక్రమాలకు నిలయంగా, అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపించేదిగా మార్చేశారు. కూలీలకు వేతన బకాయిలు పెట్టి నానా తిప్పలు పెట్టారు. చేసిన పనులు సైతం నాణ్యతా లోపంతో ఉండటం వివాదాస్పదమైంది.

ఇవీ అభ్యంతరాలు

వీబీ జీ రామ్‌జీలోని వివిధ అంశాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినప్పటికీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లేవు. దీంతో, ఈ పెంపు వలన ఎలాంటి ఉపయోగం ఉండదనే విమర్శ వస్తోంది. గతంలో మొత్తం వేతనాలను భరించడంతో పాటు, మెటీరియల్‌, నిర్వహణ వ్యయంలో 75 శాతం నిధులను కేంద్రం అందించేది. వీబీ జీ రామ్‌జీలో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపింది. పైగా చేపట్టిన పనులకు రాష్ట్రం 40 శాతం విడుదల చేస్తేనే కానీ కేంద్రం తన వాటా 60 శాతం నిధులు మంజూరు చేయదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వంద శాతం పనులు ఎలా జరుగుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వీబీ జీ రామ్‌జీ.. మార్పులివీ..

ఉపాధి హామీ పథకం అమలుకు 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తోంది. వీబీ జీ రామ్‌జీలో కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తుంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.

ఉపాధి హామీ పథకంలో నాలుగు కేటగిరీల్లో 269 రకాల పనులు చేపట్టేవారు. వీబీ జీ రామ్‌జీ ద్వారా దీనిని 318కు పెంచారు.

ఉపాధి హామీలో ఒక్కో కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తూండగా.. నూతన చట్టంలో దీనిని 125 రోజులకు పెంచారు.

ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికీ 15 రోజుల్లోగా పని కల్పించాలి. లేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి.

ఎటువంటి జాప్యం లేకుండా శ్రామికులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే పరిహారం కూడా ఇవ్వాలి.

నీటిపారుదల శాఖ అధీనంలోని చెరువుల పూడికతీత పనులను ఇప్పటి వరకూ ఉపాధి హామీ కింద చేసేవారు. ఇకపై ఆ ఖర్చులను ఆ శాఖే భరించాల్సి ఉంటుంది.

పనులు, వేతనాలు, మస్టర్ల వివరాలు బహిర్గతం చేయాలి.

ఆరు నెలలకోసారి సోషల్‌ ఆడిట్‌ తప్పనిసరి.

మారిన పేరుతో త్వరలో జాబ్‌ కార్డులు జారీ చేయనున్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ కార్డులు అందజేస్తారు.

వీబీ జీ రామ్‌జీ ఓ మాయ

వీబీ జీ రామ్‌జీ పథకంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతున్నామన్నది కేవలం మాయాజాలం మాత్రమే. ఇందులో 60 రోజుల ఉపాధి పనులను వ్యవసాయ పనుల సమయంలో కలెక్టర్‌ ఆదేశాలపై రద్దు చేసుకునే వీలు కల్పించారు. తద్వారా 60 రోజుల ఉపాధికి మంగళం పాడినట్టే. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఈ పథకాన్ని కేవలం ప్రచారానికి వాడుకోదలిచారు తప్ప ఇందులోని లొసుగులను ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వారి విధానం రాష్ట్రానికి నష్టదాయకం.

– టి.అరుణ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం

జిల్లాలో ఉపాధి శ్రామికుల వివరాలు

పంచాయతీలు 343

జాబ్‌ కార్డులు 1,83,000

యాక్టివ్‌ జాబ్‌కార్డుదారులు 1,40,000

ఉపాధి శ్రామికులు 2,80,000

యాక్టివ్‌ శ్రామికులు 1,96,000

ఉపాధి హామీ 20 ఏళ్ల ప్రస్థానం ముగింపు

నేటి నుంచి వీబీ జీ

రామ్‌జీగా మార్పు

పని దినాలు 125కి పెంపు

15 రోజుల్లో పని

కల్పించకపోతే నిరుద్యోగ భృతి

కొత్త నిబంధనలపై

వివిధ వర్గాల పెదవి విరుపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement