ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వందేళ్ల పైబడిన చరిత్ర, రూ.160 కోట్ల డిపాజిట్లు కలిగిన ది ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రమాదంలోకి నెట్టేందుకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు (బాబు), సీఈఓ, కొందరు డైరెక్టర్లు కుట్రలు చేస్తున్నారని ఆ బ్యాంకు డైరెక్టర్లు గుత్తుల భాస్కరరావు, అందనాపల్లి సత్యనారాయణ ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలకు విరుద్ధంగా 1964 సహకార చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (మ్యాక్స్) చట్టం–1995 లోకి మార్చేందుకు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, ప్రజలను, డిపాజిట్‌దార్లను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో, భయాందోళన చెందుతున్న కొంతమంది తమ డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.
మ్యాక్స్‌లోకి మారితే ప్రమాదం
గుత్తుల భాస్కరరావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా చైర్మన్‌గా ఉన్న కోళ్ల బాబును ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా ఆర్‌బీఐ మే 25న నోటీసు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, నోటీసుకు వ్యతిరేకంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారన్నారు. నాలుగు విడతలు చైర్మన్‌గా ఉన్న ఆయన బ్యాంకు అభివృద్ధికి చేసిందేమీ లేదని, ఆర్థిక వృద్ధి లేదని అన్నారు. నచ్చని ఉద్యోగులను అక్రమంగా తొలగిస్తూ, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా విధుల్లోకి చేరనివ్వడం లేదని చెప్పారు. జూన్ 18న జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, 1964 సహకార చట్టం నుంచి మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు సభ్యుల సంతకాలను దుర్వినియోగం చేసేందుకు తెర వెనుక కుటిల యత్నాలు చేశారని ఆరోపించారు. గతంలో ఆయన నిర్వాకంతో సహకార శాఖ రూ.39.50 లక్షల సర్‌చార్జి విధించిందన్నారు. మ్యాక్స్ చట్టంలోకి మార్చడం వల్ల కోళ్ల బాబు శాశ్వత చైర్మన్‌గా ఉంటారని, డైరెక్టర్లు ఆయన ఇష్టానుసారం మారుతారని, కావాల్సిన వారికి ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చని, ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ ఉండదని, ఆర్‌బీఐ క్రమంగా పట్టించుకోవడం మానేస్తుందని అన్నారు. దీంతో, బ్యాంకు పాలన ఇష్టారాజ్యమవుతుందని, ఇంట్లోని వారికి కూడా ఇష్టం వచ్చినట్లు లోన్లు ఇచ్చుకునే ప్రమాదం ఉంటుందని అన్నారు. అదే జరిగితే, జయలక్ష్మి, కార్తికేయ, మిత్ర, కృషి, ధనా బ్యాంకుల సరసన చేరే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ దూరదృష్టి వల్ల నాడు ఎన్నికలు జరిగాయని, తిరిగి నేడు పతనావస్థ నుంచి బ్యాంకును కాపాడుకోగలిగామని అన్నారు. కోళ్లతో పాటు ఆర్‌బీఐ అనర్హులుగా గుర్తించిన డైరెక్టర్లు ఇకపై బ్యాంకుల్లో విధులు నిర్వహించవచ్చో లేదో సహకార శాఖ అధికారులు స్పష్టం చేయాలని గుత్తుల డిమాండ్ చేశారు.
సహకార చట్టమే శ్రీరామరక్ష
అందనాపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మ్యాక్స్ చట్టంలోకి మార్చే యత్నాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. బ్యాంకు నిర్వహణ సహకార చట్టంలో ఉండటం వల్ల ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుందని, కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. డిపాజిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యజ్జవరపు మరిడయ్య మాట్లాడుతూ, 40 ఏళ్లుగా సహకార బ్యాంకుల రంగంలో డైరెక్టర్‌గా, డిపాజిట్‌దారుగా ఉన్నానని చెప్పారు. సహకార బ్యాంకుల ఉద్దేశం దెబ్బ తినేలా కోళ్ల బాబుతో పాటు మరికొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదవి నుంచి తప్పుకోవాలని చైర్మన్‌కు ఆర్‌బీఐ చెప్పడంతో మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు ప్రయత్నించారన్నారు. గత నాలుగు విడతలుగా ఎన్నికలు జరపకుండానే కోళ్ల బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఒత్తిడితో గత్యంతరం లేక ఎన్నికలు పెట్టారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ సభ్యులు లేరని, హాజరైన సభ్యుల సంతకాలతో హైకోర్టును తప్పుతోవ పట్టించే కుటిల యత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఉద్యోగ నియమాకాలు చేపడుతున్నారని మరిడయ్య అన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో వావిలాల గోపాలకృష్ణయ్య మేనల్లుడు భువనగిరి వెంకటరమణ, బ్యాంకు నుంచి అక్రమంగా తొలగించిన మాజీ ఉద్యోగులు, డిపాజిట్‌దారులు పాల్గొన్నారు.
బ్యాంకును చైర్మన్ ప్రమాదంలో
పెడుతున్నారు
ఆయనను తొలగిస్తూ
మే 25నే ఆబీఐ నోటీసు
గుట్టుగా హైకోర్టును ఆశ్రయించారు
‘ఇన్నీసుపేట బ్యాంకు’ డైరెక్టర్ల వెల్లడి


