రాజమహేంద్రవరం రూరల్: బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ) పూర్తి తటస్థంగా వ్యవహరించాలని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఢిల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. అనంతరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)తో బీఎల్‌ఓలు సమన్వయం చేసుకుంటూ సర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ వివిధ కారణాలతో మ్యాపింగ్ కాని ఓటర్లను రాజకీయ పార్టీల సహకారంతో గుర్తించి, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అవసరమైతే అదనంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించి ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు. సర్ విధుల్లో నిర్లక్ష్యం చూపే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు.
షోకాజ్ నోటీసు
రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన స్వర్ణ గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వీవీఎన్‌ఎస్‌ఎస్‌ఆర్‌కే సుధీర్ సర్ విధులకు హాజరు కాకపోవడం, కార్యాలయ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ ఎస్.భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


