కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ పార్టీ బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ను వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ కోరారు. ఈ మేరకు ఎస్పీని ఆయన కార్యాలయంలో మంగళవారం కలసి వినతిపత్రం అందజేశారు. నగరానికి చెందిన రామకృష్ణ తమ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడంతో ఆయనపై స్థానిక ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. రామకృష్ణను 12 కేసుల్లో ఇరికించడంతో పాటు రౌడీషీట్ కూడా తెరిచారన్నారు. ఈ కేసులు, రౌడీషీట్, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ మేరకు హైకోర్టు 10 కేసులు కొట్టివేసిందని, కేవలం రెండు కేసులు మిగిలాయని, వాటి ఆధారంగా ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు రామకృష్ణను వేధిస్తున్నారని తెలిపారు. స్థానిక 40వ వార్డులో అధికార పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య పేకాట, బ్రాకెట్ వంటి నేరపూరిత కార్యకలాపాల నిర్వహణలో విభేదాలు తలెత్తి కొట్టుకున్నారన్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గం తలలు పగిలిపోగా, బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే, దెబ్బలు తిన్నవారిపై ఎమ్మెల్యే సానుభూతి చూపించి, న్యాయం చేయకపోగా తిరిగి వారిపై మరో కేసు నమోదు చేయించారని ఎస్పీకి భరత్ తెలిపారు. పైగా ఆ వార్డుతో పాటు నగరంలోని ఏ వార్డులోనూ వైఎస్సార్ సీపీ వారిని, చివరకు తనను సైతం తిరగనిచ్చేది లేదంటూ అధికార పార్టీ నాయకులు, అనుచరులు బహిరంగ సవాళ్లు చేసి, శాంతిభద్రతల సమస్య సృష్టించారన్నారు. ఈ నేపథ్యంలో శెట్టిబలిజ సంఘీయులు వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సంఘ పెద్దలు తమ వర్గీయుడైన రామకృష్ణపై ఈవిధమైన చర్యలు సహించేది లేదని, ఆయనకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో కేసులతో సంబంధం లేకపోయినా పోలీసులు అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించి రామకృష్ణను సెంట్రల్ జైలుకు పంపించారని, దీంతో, ఆయన కుటుంబం ఇబ్బందుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన విజ్ఞప్తిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని భరత్‌రామ్ తెలిపారు.


