ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు మంగళవారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది.
నేటి నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్
ధవళేశ్వరం: వరదల సీజన్ ప్రారంభం కానుండటంతో ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ కార్యాలయం వద్ద బుధవారం నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ పని చేయనుంది. ఇది అక్టోబర్ 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని హెడ్‌వర్క్స్ ఈఈ జి.శ్రీనివాసరావు తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను 0883–2417066 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ముద్రగడ త్వరగా కోలుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా
రాంబాబు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారిగా జ్యోతుల రాంబాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన వి.కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో, ఆయన స్థానంలో కాకినాడ పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబును నియమించారు. ఆయనను పలువురు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు.


