● గుండెపోటుతో రాజానగరం ఏఎస్సై మృతి
● మొక్కలకు నీరు పోస్తూ తుదిశ్వాస
రాజమహేంద్రవరం రూరల్/రాజానగరం: ఎస్సై కావాలనుకున్న తన కల ఒక్క రోజులో నెరవేరుతుందనుకున్న వేళ.. ఊహించన విధంగా ఓ ఏఎస్సై హఠాత్తుగా మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పాత బొమ్మూరు మధురా నగర్‌కు చెందిన 1989 బ్యాచ్ కానిస్టేబుల్ ఎ.రాజా ప్రకాష్‌బాబు (59) రెండేళ్లుగా రాజానగరంలో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో 45 రోజుల పాటు ఎస్సై శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన.. ఏలూరు రేంజ్ కార్యాలయంలో బుధవారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో తన ఇంటి వద్ద మొక్కలకు మంగళవారం నీళ్లు పోస్తూండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రకాష్‌బాబు మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు 2019లో పట్టిసీమ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సైగా బాధ్యతలు చేపడతారని అనుకున్న ఆనంద సమయంలో ప్రకాష్‌బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న ప్రకాష్‌బాబు మృతదేహానికి పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. పోలీసు లాంఛనాలతో ప్రకాష్‌బాబు మృతదేహాన్ని ధవళేశ్వరంలో ఖననం చేశారు.
యోగా ట్రైనర్‌గా..
ప్రకాష్‌బాబు పోలీసు వృత్తితో పాటు యోగా ట్రైనర్‌గా కూడా సేవలందిస్తున్నారు. పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణకు వచ్చే కానిస్టేబుళ్లకు యోగా శిక్షణ ఇచ్చేవారు. పోలీసు శాఖలో జాతీయ స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి మెడల్స్ కై వసం చేసుకున్నారు.
ఎస్పీ సంతాపం
ఏఎస్సై ప్రకాష్‌బాబు మృతి పట్ల ఎస్పీ డి.నరసింహ కిషోర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాఖాపరంగా ఆర్థిక సహాయాలు, సేవా సంబంధిత ప్రయోజనాలు ఎటువంటి జాప్యం లేకుండా ప్రకాష్‌బాబు కుటుంబానికి అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి పోలీసు సంక్షేమ నిధి ద్వారా అంత్యక్రియల ఖర్చులు, వితంతు నిధి, ఇతర వ్యయాల నిమిత్తం రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ప్రకాష్‌బాబు పార్ధివ దేహానికి పోలీసు అధికారులు పుష్పాంజలి ఘటించారు.


