సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వింటే భారతం వినాలి.... తింటే గారెలు తినాలి... చూస్తే సురభి నాటకాన్నే చూడాలి అనేది ఐదు దశాబ్దాల క్రితం మాట. సినిమా మాయాజాలం ప్రజలకు చేరువ కానప్పుడు నాటకమే ప్రేక్షకులకు వినోదాన్ని పంచేది. వాటిలో సురభి నాటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అప్పటి వరకు మన నాటకాలలో పద్యాలను రాగయుక్తంగా ఆలపించి శ్రోతలను అలరించేవారు. సురభి నాటకాలు వచ్చిన తరువాత నాటకాలు మరో స్టేజికి వెళ్లాయి. సురభి నాటకాలు ప్రదర్శిస్తుంటే ప్రేక్షకులు కళ్లుప్పగించే చూసేవారు. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ సెట్టింగ్స్ అంతా మాయాలోకంలో విహరించే విధంగా ఉండేవి. నిజంగా కళ్ల ముందు ఆ మాయజాలం కనబడటంతో ప్రేక్షకులు మైమరచిపోయేవారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వేంటేశ్వర ఆనం కళాకేంద్రంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, నగరపాలక సంస్థ సౌజన్యంతో ఇటీవల శ్రీనివాస కల్యాణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కళాకారులు పలు విషయాలను పంచుకున్నారు.
స్పెషల్ ఎఫెక్ట్‌లకు నాంది
రంగస్థలం మీద సెలయేళ్లు దూకినట్లు, లేళ్లు పరిగెత్తినట్లు, పక్షుల కిలకిలారావాలు, ఎలుగుబంట్లు నివసిస్తునట్లు, నారదుడు మేఘాల నుంచి కిందకు వచ్చినట్లు, సప్తసముద్రాల మీద నుంచి గండభేరుండం దాటినట్లు, గగనంలో ఆయుధాలతో పోరాడినట్లు, నిండు చంద్రుడు, నక్షతాలు విహరిస్తున్నట్లు, ఘటోత్కచుడు లడ్డూలు అరగిస్తున్నట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో అద్భుతాలు చూపించి ప్రదర్శించటంలో సురభి నాటక సమాజానికి మరెవ్వరూ సరిరారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
ఇప్పటికీ సురభి నాటకానికి ఆదరణ తగ్గలేదు. సురభి నాటకం బతకాలన్నా, సురభి నాటకాలు ప్రజలకు చేరువ కావాలన్నా ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉందని కళాకారులు అంటున్నారు. ఒక నాటకాన్ని ప్రదర్శించాంటే లారీ సెట్టింగ్స్ కావాలి. సురభి నటీనటులు 50 వరకు కావాలి. పాత్రలు లేని వారు తెరలు దించడం, ఎక్కించడం, రంగస్థలం అలంకరణ, లైటింగ్ అన్ని శాఖలు అందరూ చూస్తారు. విగ్గులు, కిరీటాలు రూపొందించడం, దుస్తులు కట్టడం వంటివి చేస్తారు.
శ్రీవినాయక నాట్య మండలి(సురభి)
1925లో ఆర్.మోహన్‌రావు, ఆర్.వేణుగోపాల్‌రావు శ్రీవినాయక నాట్యమండలి(సురభి) పేరుతో ఒక నాట్య సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో 50 మంది కళకారులు ఉంటారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో సీ్త్రలు 18 మంది పురుషులు 25 మంది పిల్లలు ఏడుగురు ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో
2009లో టీటీడీ శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి సురభి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటీ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో 3 వేలకి పైగా నాటకాలను ప్రదర్శించారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో నాటకాన్ని ప్రదర్శించడమే కాకుండా నాటకం అయిపోయే వరుకు ఎటువంటి మద్య, మాంసాలను సైతం ముట్టుకోకుండా నియమ నిష్టలతో ప్రదర్శన కొనసాగిస్తారు.
ఘటోత్కచుడు పాత్రలో మెప్పించిన
వేణుగోపాల్‌రావు(ఫైల్)
నాటకమే మా జీవనాధారం
నాటకం ప్రదర్శించడం ఒకప్పుడు పండగలా ఉండేది. ఎంతోమంది దాతలు, ప్రజల సహకారంతో నాటక రంగం ఒక వెలుగు వెలిగింది. కాని నేడు అ పరిస్థితులు కనబడటం లేదు. నాటకం ప్రదర్శించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడవలసి వస్తోంది. ఖర్చులు పెరగడమే తప్ప రాబడి లేదు. ఖర్చులు అధికం ఆదాయం శూన్యంగా ఉంది. ప్రభుత్వం సహాకరించి సురభి నాటకోత్సవాల పేరుతో ఒక వారం రోజుల పాటు ప్రతి జిల్లాలో ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తే సురభి కళాకారులను ఆదుకున్నట్టు అవుతుంది.
– సురభి వేణుగోపాల్‌రావు,
శ్రీవినాయక నాట్యమండలి
సురభి ప్రస్థానం
సురభికి 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1850 పూర్వం మహారాష్ట్రకు చెందిన అరే మరాఠీలు ఆంధ్రరాష్ట్రానికి వలస వచ్చారు. వనావన గోవిందరావు సురభి నాటకాలకు ఆద్యుడు. కాలక్రమేణా వీరి కుటుంబం విస్తరించడం వల్ల మూడు శాఖలుగా విడిపోయింది. అందులో ఒక శాఖ సురభిగా వ్యవహారంలోకి వచ్చింది. ఛత్రపతి శివాజీ రాజ్యంలో సైనికులుగా ఉన్న వీరు రాయలసీమ ప్రాంతానికి వలస వచ్చారు. తోలుబొమ్మలాటను వృత్తిగా స్వీకరించారు. 1885లో కడప జిల్లాలో కీచకవధ నాటకంతో గోవిందరావు శ్రీకారం చుట్టారు. సురభి కంటే ముందు ప్రదర్శించే నాటకాల్లో సీ్త్ర పాత్రలు పురుషులే నిర్వహించేవారు. సురభి వచ్చిన తరువాత సురభి కటుంబానికి చెందిన కళాకారులు పాత్రలు పోషించేవారు. 70 ఏళ్ల వృద్ధుని నుంచి 3 నెలల పాప వరకు పాత్రలు పోషిస్తూ సన్నివేశానికి అనుగుణంగా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.
ఖర్చులు అధికం... ఆదాయం శూన్యం
సినీ గ్రాఫిక్స్‌ను తలపించే
సెట్టింగ్‌లు సురభి సొంతం
భారీ సెట్టింగ్స్, లైటింగ్స్‌తో
నాడు ప్రేక్షకులకు కనువిందు
నేడు నాటకానికి తగ్గిన ప్రాధాన్యం
అయినా మక్కువ తగ్గని
సురభి కళాకారులు


