ఫ బైక్‌లు, హుండీ సొమ్ములను దొంగతనం చేస్తున్న ఐదుగురు యువకులు
ఫ అరెస్ట్ చేసిన తాళ్లపూడి పోలీసులు
తాళ్లపూడి: చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు వివిధ నేరాలపై జైలుకు వెళ్లారు. అక్కడ స్నేహితులుగా మారి, బయటకు వచ్చాక చోరీల బాట పట్టారు. ఈ క్రమంలో దేవాలయాల్లో హుండీలను పగలకొట్టి సొమ్మును చోరీ చేస్తున్న వారిని తాళ్లపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై టి.రామకృష్ణ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. గజ్జరంలోని ఆంజనేయస్వామి, రావూరుపాడు జంక్షన్‌లోని మేరీమాత ఆలయాల్లో హుండీలను ఇటీవల దొంగలు పగలకొట్టి సొమ్మును చోరీ చేశారు. ఆ మేరకు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చేపట్టిన తనిఖీల్లో సోమవారం తాళ్లపూడిలో ఐదుగురు యువకులు పట్టుబడ్డారు. వీరు మోటారు సైకిళ్లను కూడా దొంగతనం చేస్తున్నట్టు గుర్తించి, వారి నుంచి రెండు బైక్‌లను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి ఎన్టీఆర్ కాలనీకి చెందిన అయినవల్లి వినయ్ కుమార్, అయినవిల్లి అంజి, తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన కట్టుంగ దామోదరం (స్మైలీ సాయి), పెద్దేవంకు చెందిన బట్టు సంతోష్, కొవ్వూరు మండలం ధర్మవరానికి చెందిన బర్ల గౌతమ్‌గా నిందితులను గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. చెడు వ్యసనాలకు అలవాటు వీరందరూ పాత నేరస్తులు. జైలులో ఉన్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. జూలై 5న మలకపల్లికి చెందిన సాయి విడుదలైన తర్వాత కలిసికట్టుగా దొంగతనాలకు పాల్పడ్డారు.


