గతంలో ఇంటికే రేషన్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి వృద్ధులు, వితంతువులు, రోగులతో పాటు లబ్ధిదారులందరి కోసం ఇంటింటికి రేషన్ సరకుల వాహనాన్ని పంపి ఇళ్ల వద్దే రేషన్ తీసుకునే పరిస్థితిని కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లే వాహనాలను రద్దు చేసి చౌక డిపోల వద్దకు వెళ్లే విధానాన్ని మళ్లీ అమలు చేసింది. ఇప్పటి వరకూ డీలర్లు తమ పరిధిలోని వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేని వారికి ఇళ్లకే రేషన్ సరకులు పంపించేవారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లకే రేషన్ సరకులు తీసుకు వెళ్లే విధానాన్ని ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వర్తించేలా పరిమితులు విధించింది. ఇక నుంచి డీలర్ల అలా పంపుదామన్నా ప్రభుత్వం చౌక డిపోల సర్వర్‌లో ఆ ఆప్షన్‌ను ఈ నెల నుంచి తొలగించింది. కేవలం 65 ఏళ్లు దాటిన వారి ఇంటికి పంపేలా పాత విధానాన్ని కొనసాగించనుంది. డీలర్లు అక్రమాలకు పాల్పడున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
అమలాపురం టౌన్ /సీటీఆర్‌ఐ: వారందరూ ఆరు పదుల దాటిన వృద్ధులు, విధి వంచితులైన వితంతువులు, అనారోగ్యంతో ఇంట్లోంచి బయటకు రాలేని రోగులు. వీరికి ఇప్పటి వరకూ రేషన్ డిపోలకు వెళ్లకుండానే సరకులను డీలర్లు మానవతా దృక్పథంతో ఇళ్లకే అందించేవారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ నెల నుంచి వారికి రేషన్ సరకులు ఇళ్లకు రాకుండా పోతున్నాయి. ఇక నుంచి ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ డిపోలకు వెళ్లి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆప్షన్ తొలగించి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోససీమ జిల్లాలోని 779 చౌక డిపోల్లో దాదాపు 3.59 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలోని 871 చౌక డిపోల్లో 6.5 లక్షలు, కాకినాడ జిల్లాలోని 1060 దుకాణాల్లో 6.50 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రతి డిపో పరిధిలో ఇళ్లకే రేషన్ పంపించే కార్డులు 50కి తక్కువ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకు అంబాజీపేటలో ఓ వృద్ధ దంపతులు ఉన్నారు. వారిలో భర్తకు 70, భార్యకు 64 ఏళ్ల వయసు ఉంది. ఇంటి ఇల్లాలు పేరుతో రేషన్ కార్డు ఉంటుంది. సంబంధిత డీలరు వారికి రేషన్‌ను ఎప్పటిలాగే ఇంటికి పంపించేందుకు సర్వర్ ఓపెన్ చేయగా ఆప్షన్ చూపించలేదు.
రేషన్ డిపోకు
రమ్మంటున్నారు
నా భార్య వయసు 64 ఏళ్లు, ఆమె పేరుతోనే రేషన్ కార్డు ఉంది. నాకు 70 ఏళ్లు నిండాయి. పైగా రోగిని కూడా. నా భార్యకు 64 ఏళ్లు కావడంతో డీలర్ సర్వర్‌లో ఆమెకు ఇంటికే రేషన్ ఇచ్చే ఆప్షన్ లేకుండా చేశారు. ప్రతి నెలా రేషన్ సరకులను ఇంటి వద్దే అందుకునే వాళ్లం. ఇక నుంచి డిపోకు రావాలని చెబుతున్నారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో స్పందించి నాలాంటి వృద్ధులు, రోగుల ఇళ్లకే రేషన్ సరకులను పంపించాలి.
– పి.రామారావు,
అంబాజీపేట
65 ఏళ్లు దాటిన వారికి మాత్రమే..
ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వారి ఇళ్లకు మాత్రమే ప్రతి నెలా 26వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రేషన్ డీలర్లు సరకులు పంపిస్తారు. మిగిలిన వారందరూ 1వ తేదీ నుంచి చౌక డిపోలకు వెళ్లి తీసుకోవాల్సిందే. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, రోగులకు ఇంటికి అందించే ఆప్షన్‌ను సర్వర్ల నుంచి తొలగించారు.
– అడపా ఉదయ భాస్కర్, పౌర సరఫరా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఫ 65 ఏళ్లు నిండితేనే ఇంటికి రేషన్
ఫ చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెలిక
ఫ ఇప్పటి వరకూ వితంతువులు,
60 ఏళ్లు నిండిన వారికి పంపిణీ
ఫ ఇక నుంచి ఆ విధానం తొలగింపు
ఫ చౌక డిపోల వద్దే
తీసుకోవాలని ఆదేశం


