ప్రతిభ ఉంటే మెరికలే : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ ఉంటే మెరికలే : కలెక్టర్‌

Jun 30 2026 12:07 AM | Updated on Jun 30 2026 12:07 AM

రంగంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన మార్గదర్శకం అందిస్తే మెరికల్లా తయారవుతారని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన రంగంపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులను సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది అక్టోబర్‌ 18, 19 తేదీల్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సైన్స్‌ కాస్టిల్‌ ఆసియా అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో రంగంపేట పాఠశాల విద్యార్థిని ఆవుపాటి రమ్య సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా ఖండానికి చెందిన 10 దేశాల విద్యార్థులు గట్టి పోటీనిచ్చినప్పటికీ, రమ్య రూపొందించిన ప్రాజెక్టు ‘స్టూడెంట్‌ ఫ్రెండ్లీ పెన్‌’తో కాంస్య పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ వినూత్న ఆవిష్కరణ విద్యార్థుల నిజ జీవిత అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ కొనియాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియన్‌ యంగ్‌ ఇన్నోవేటర్స్‌ అండ్‌ ఇన్వెన్షన్‌ చాలెంజ్‌’లో రంగంపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు బి.పల్లవి, ఎం.జాహ్నవి రూపొందించిన ‘బయోమెట్రిక్‌ మెషీన్‌’ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి రజత పతకం లభించడంతో కలెక్టర్‌ అభినందించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన హెచ్‌ఎం వి.పార్ధసారథిని, గైడ్‌ చేసిన జీవశాస్త్ర ఉపాధ్యాయిని వి.రమ్యసుధను కూడా కలెక్టర్‌ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement