దుంపముంచింది! | - | Sakshi
Sakshi News home page

దుంపముంచింది!

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

కనుమరుగవుతున్న కర్రపెండలం

పెరగని ధరతో సంక్షోభం

60 వేల నుంచి 5 వేల ఎకరాలకు పడిపోయిన సాగు

రంగంపేట: ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి మెట్ట ప్రాంత రైతులకు బంగారు పంట కరప్రెండలం (టాపియోకా) సాగు. ఈ దుంప నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. సగ్గు బియ్యం తయారీకి ప్రధాన ముడిసరుకై న ఈ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు సాగును పూర్తిగా వదిలేస్తున్నారు. ఒకప్పుడు 60 వేల ఎకరాల్లో ఉండా, గత ఏడాది 8 వేల ఎకరాలకు, ప్రస్తుతం కేవలం 5 వేల ఎకరాలకు పరిమితం కానుండడం పరిస్థితిని తెలియజేస్తోంది.

1965లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొందరు అభ్యుదయ రైతులు కరప్రెండలం విత్తనాన్ని తీసుకురావడంతో ఈ పంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పదేళ్లలోనే 20 వేల ఎకరాలకు విస్తరించిన ఈ పంట, 2000 నాటికి రికార్డు స్థాయిలో 60 వేల ఎకరాలకు చేరుకుంది. రంగంపేట, పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం, ప్రత్తిపాడు, రంపచోడవరం, గోకవరం, రాజవొమ్మంగి, కోటనందూరు తదితర 14 మండలాల్లో ఈ పంట విస్తరించడంతో జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఏర్పడ్డాయి.

క్రమంగా సంక్షోభంలోకి..

2010 తర్వాత కర్రపెండలం పంట క్రమంగా సంక్షోభంలోకి జారుకుంది. పంట మార్పిడి లేక ఎకరానికి 40 పుట్ల (ఒక పుట్టి– 225 కిలోలు) దిగుబడి 20 పుట్లకు పడిపోయింది. అదే సమయంలో పుట్టికి రూ.వెయ్యి నుంచి రూ.1,200 మాత్రమే ధర లభించడం, పామాయిల్‌ సాగు వేగంగా విస్తరించడంతో పెద్ద రైతులు దుంప సాగును పూర్తిగా వదిలేశారు. దీంతో 2015 నాటికి సాగు ఇరవై వేల ఎకరాలకు, 2020 నాటికి పది వేల ఎకరాలకు, 2025లో ఎనిమిది వేల ఎకరాలకు, ప్రస్తుతం ఐదు వేల ఎకరాలకు పడిపోయే పరిస్థితి వచ్చింది.

మూతపడుతున్న మిల్లులు

ఒకప్పుడు జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఉండేవి. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ప్రస్తుతం 8 మిల్లులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మిగిలిన మిల్లులూ మూతపడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా, అధిక దిగుబడినిచ్చే ఆధునిక విత్తనాలు సరఫరా చేయాలి. సగ్గుబియ్యం మిల్లర్లతో చర్చించి కనీస ధరను ఖరారు చేయాలి. రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

రైతన్నలకు ‘పంట’గ లేకుండా చేశారు.. కష్టాల కొరివి

పెట్టారు.. సాగును దండగగా మార్చారు.. చివరికి బంగారు పంటగా భావించే కర్రపెండలం కంటిచూపునకు కనిపించకుండా చేస్తున్నారు. ఈ పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు ఆపసోపాలు పడుతున్నారు.. చేసేదిలేక సాగునే వదిలేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

గిట్టుబాటు ధర కల్పించాలి

కర్రపెండలం దుంపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. పదేళ్ల క్రితం ఇచ్చిన ధరే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలి. లేదంటే కర్రపెండలం పంట చరిత్రలో కలసిపోతుంది.

–పుట్టా సోమన్నచౌదరి, గౌరవ అధ్యక్షుడు, జిల్లా దుంప రైతుల సంఘం

బెధరగొట్టేలా..

ఎరువులు, కూలీల ఖర్చులు, సాగు వ్యయం రెట్టింపు అయినా.. కర్రపెండలం ధర మాత్రం పదేళ్లుగా పుట్టికి రూ.వెయ్యి దాటలేదు. ఈ పరిస్థితి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఈ ఏడాది పంట విరామం ప్రకటించడంతో మిల్లర్లు ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో సన్న, చిన్నకారు రైతులు మళ్లీ కొంతమేర సాగు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రంగంపేట మండలం సింగంపల్లి, దొడ్డిగుంట, వీరంపాలెం, కోటపాడు తదితర గ్రామాల్లో కర్రపెండలం నాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే గిట్టుబాటు ధరపై స్పష్టత లేక రైతులు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement