అక్రమాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

ఐక్యత చాటుతున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మార్గాని భరత్‌రామ్‌,

మార్గాని నాగేశ్వరరావు, కోడి ప్రవీణ్‌, వాసంశెట్టి గంగాధరరావు తదితరులు

శెట్టిబలిజ సంఘీయుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు

రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని.. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయుడైన వైఎస్సార్‌ సీపీ నగర బీసీ సెల్‌ చైర్మన్‌ పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్‌ అక్రమంగా నమోదు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ధ్వజమెత్తారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులోని శ్రీగ్రాండ్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అధ్యక్షతన శెట్టిబలిజ సంఘీయుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఒత్తిడితో పీతా రామకృష్ణపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించడం దారుణమని సమావేశం పేర్కొంది. సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ ఉద్యమాలు చేసేవారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తే, దేశంలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు. పీడీ యాక్ట్‌ను ఉపసంహరించుకోకపోతే శెట్టిబలిజ సంఘీయులంతా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం పక్కనపెట్టి, లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలు రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్‌రావు మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్న యువ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఐక్యంగా పోరాటం చేద్దాం

వైఎస్సార్‌ సీపీ నాయకుడు కోడి ప్రవీణ్‌ మాట్లాడుతూ, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఐకమత్యంగా పోరాటం చేద్దామన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ముఖ్యంగా రామకృష్ణకు అన్యాయం జరిగిందని, శెట్టిబలిజ సంఘీయులు ఐక్యంగా ఉంటే కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలబడిన వైఎస్సార్‌ సీపీ నాయకులను అడ్డుకోవడమే కాకుండా, అధికార పార్టీ గుండాలతో రాళ్ల దాడితో చేయించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమవుతున్నాయని అన్నారు. నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కక్ష సాధింపు చర్యలు మితిమీరాయని, ఈ రెండేళ్లలో తనపై 17 అక్రమ కేసులు పెట్టారనీ భరత్‌రామ్‌ అన్నారు. ఇలా తన పాస్‌పోర్ట్‌ను కూడా నిలిపివేయించారన్నారు. కళా, సాంస్కృతిక చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవరంలో ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చూడలేదన్నారు. రామకృష్ణపై పెట్టిన అక్రమ పీడీ యాక్ట్‌ విషయమై హైకోర్టులో సవాల్‌ చేస్తానని, న్యాయ పోరాటం చేస్తానని, అతని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్‌రేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశానని.. జిల్లా కలెక్టర్‌ సంబంధిత డీఎస్సీని వివరణ కోరగా ఆయన సమాధానం చెప్పలేకపోయారన్నారు. సమావేశంలో న్యాయవాది ఇళ్లా భాస్కరరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, శెట్టిబలిజ సంఘీయులు పెద్దఎత్తున హాజరయ్యారు.

పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్‌ దారుణం

మాజీ ఉప ముఖ్యమంత్రి

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

రాబోయే రోజుల్లో సిటీ ఎమ్మెల్యేకు గుణపాఠం చెబుతాం

మాజీ ఎంపీ భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో శెట్టిబలిజల రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement