● నదిలో మునిగి ఇద్దరి మృతి
● సరదాగా స్నానం చేస్తుండగా ఘటన
సీతానగరం: నవ్వుల పువ్వులు రాలిపోయాయి.. ఆటపాటల జ్ఞాపకాలు చెరిగిపోయాయి.. కన్నవారిలో తీరని విషాదాన్ని నింపాయి.. సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఆ నది తనలోకి లాగేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం వెదుళ్లపల్లి పంచాయతీ పరిధి రాజంపేటకు చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (14), రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడుకు చెందిన అల్లు సాయిదుర్గా మహేష్ (14) రాజంపేట వద్ద గోదావరిలో నీట మునిగి మృతి చెందారు. వెదుళ్లపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో దుర్గాప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. తొర్రేడుకు చెందిన మహేష్ సీతానగరం మండలం కాటవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాజంపేటలో బంధువుల ఇంటికి మహేష్ వచ్చాడు. మధ్యాహ్నం వర్షం పడటంతో గోదావరి చూద్దామని దుర్గాప్రసాద్, మహేష్‌లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి ఏటిగట్టు పక్కన ఉన్న లంక భూమిలో క్రికెట్‌ను చూసి, అక్కడి నుంచి ఇసుక లారీలు వెళ్లడానికి వేసిన రోడ్డుపై నుంచి గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు ఒడ్డున కూర్చోగా, దుర్గాప్రసాద్, మహేష్‌లు గోదావరిలోకి దిగి కేరింతలు కొడుతూ ఈత కొట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ వారిద్దరూ గోదావరిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న విగతా ముగ్గురూ భయభ్రాంతులకు గురై పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు, మత్స్యకారులు గోదావరిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్గాప్రసాద్ తండ్రి వెంకటరమణ వ్యవసాయ కూలి. తల్లి శ్యామల, ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్న అక్క హేమసుధ ఉన్నారు. మహేష్ తండ్రి శ్రీను, తల్లి కలసి బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై టి.శ్యామ్‌సుందర్ తెలిపారు
తాకట్టు పెట్టిన
బంగారాన్ని మార్చేసి..
రామచంద్రపురం రూరల్: ప్రైవేట్ సంస్థలో బంగారం తాకట్టు పెడితే, ఆ స్థానంలో నకిలీ బంగారం పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ద్రాక్షారామ మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 8 మంది ఖాతాదారుల తాలూకా ఆభరణాలను గతంలో పనిచేసిన మేనేజర్ ఎస్.మగేష్ దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ బంగారం పెట్టి మోసానికి పాల్పడినట్లు ఇంటర్నల్ ఆడిట్‌లో గుర్తించారు. ఈ మేరకు ఏరియా మేనేజర్ పి.భానుప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. 8 మంది ఖాతాదారులకు సంబంధించిన సుమారు రూ.19,63,000 విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు.


