● డేవిడ్‌కు అభిమానుల నిర్వహణ
● వీడియో కాల్‌లో వీక్షించిన కుటుంబ సభ్యులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే, వారికి వారసులు కానీ, బంధువులు కానీ శ్రాద్ధకర్మలు చేయడం ఆచారం. కానీ ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన అభిమానులు శ్రాద్ధకర్మ నిర్వహించడం ప్రత్యేకతను చాటింది. ఆదివారం రాజమహేంద్రవరం గోదావరి కోటిలింగాల ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పితృకర్మలు, శ్రాద్ధం వంటి హిందూ సంస్కృతిలోని లోతైన అంశాలపై దాదాపు 40 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా అధ్యయనం చేసి, వాటిపై అనేక గ్రంథాలను రచించిన డేవిడ్ ఈ నెల జూలై 4న యూఎస్‌ఏలోని వర్జినియాలో కన్నుమూశారు. ఆయన ఓ సంస్కృత పండితుడు. ప్రకృతి, సృష్టి ధర్మాల్లో ప్రధానమైన క్రతువులు, యజ్ఞ యాగాదులు నిర్వహించే నిత్య అగ్నిహోత్రుల గురించి డేవిడ్ ఎంతో పరిశోధన చేశారు. దాదాపు 3 వేల ఏళ్లగా యజ్ఞం, యాగం నిర్వహణలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోకుండా ఆ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తూ వస్తున్న అగ్నిహోత్రుల గురించి, యాగ పండితుల గురించి అనేక పుస్తకాలను రచించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఓ విదేశీయుడుగా కేవలం గ్రంథాలు చదవకుండా శ్మశానంలో దిగి చితి దగ్గర కూర్చుని కర్మలను డాక్యుమెంట్ చేశారు. ఇది హిందూ మతంపై పాశ్చాత్యులకు ఉన్న అపోహలను తొలగించింది. రాజమహేంద్రవరం, కోనసీమకు చెందిన శ్రీరామపురం అగ్రహారం, నేదునూరు వ్యాఘ్రేశ్వరం, ఇరగవరంలలో పనిచేసిన ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు కోటిలింగాల రేవులో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. డేవిడ్ శ్రాద్ధ కర్మలను యూఎస్‌ఏలో ఉన్న ఆయన భార్య సుసాన్, కుమార్తె నికోల వీడియో కాల్‌లో తిలకించారు.


