రక్తమోడిన రహదారి | - | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారి

Jun 29 2026 12:17 AM | Updated on Jun 29 2026 12:17 AM

వడిశలేరు సెంటర్‌లో ప్రమాదాలు

నిమిషాల వ్యవధిలో రెండు ఘటనలు

రంగంపేట: అసలే ప్రమాదకర కూడలి.. ఆపై ఒక్కసారిగా కురిసిన వర్షం.. వెరసి ఆదివారం సాయంత్రం రంగంపేట మండలం వడిశలేరు సెంటర్‌లో రక్తమోడింది. ఈ ఏడీబీ రోడ్డుపై నిమిషాల వ్యవధిలోనే జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. వడిశలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీను తన భార్య శశి, కుమార్తె లాస్యతో కలిసి బైక్‌పై రాజమహేంద్రవరం వెళ్లేందుకు బయలుదేరారు. వారు వడిసలేరు సెంటర్‌ దాటుతుండగా, అతి వేగంగా దూసుకొచ్చిన గూడ్స్‌ వ్యాన్‌ వారి బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తక్షణమే స్పందించి క్షతగాత్రులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన గూడ్స్‌ వ్యాన్‌ డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి, అనంతరం రంగంపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

మరో ఘటనలో..

ఈ ప్రమాదం జరిగి స్థానికులు కోలుకోకముందే అదే సెంటర్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కాకినాడ బీచ్‌ నుంచి నిడదవోలు వెళ్తున్న ఒక టెంపో వ్యాన్‌ వడిశలేరు సెంటర్‌ వద్దకు రాగానే అదుపు తప్పి, ఏడీబీ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కూడలిలో అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయినా, కాళ్లు చేతులు విరిగినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement