మ్యాక్స్‌మమ్‌ బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌మమ్‌ బ్రేక్‌

Jun 29 2026 12:11 AM | Updated on Jun 29 2026 12:11 AM

ఇన్నీసుపేట అర్బన్‌ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే యత్నం వాయిదా వేసుకోవాలని సహకార అధికారి ఆదేశం అయినా పట్టించుకోని పాలకవర్గం

అజెండాలో నంబర్‌ మార్చి, ఏమార్చేందుకు కుయుక్తి మహాజన సభలో అడ్డుకున్న సీనియర్‌ సభ్యులు ఈ వ్యవహారంపై హైకోర్టుకు.. కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామన్న చైర్మన్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): నగరంలో 114 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును ప్రస్తుతం ఉన్న సహకార సంఘం చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌) చట్టంలోకి మార్చేందుకు జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజమహేంద్రవరంలోని అల్యూమినియం అసోసియేషన్‌ హాలులో బ్యాంకు 108వ సాధారణ మహాజన సభ ఆదివారం జరిగింది. బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే అంశంపై అజెండాలో తొలుత 7వ నంబరులో ఉన్న అంశాన్ని 15వ నంబరుకు మార్చారు. సభ్యులకు నజరానాలు పంచారు. తద్వారా మ్యాక్స్‌ చట్టంలోకి బ్యాంకు మారేలా సభ్యుల ఆమోదం పొందేందుకు చైర్మన్‌, పలువురు పాలకవర్గ సభ్యులు ప్రయత్నించారు. వారి తీరుపై సీనియర్‌ సభ్యులు మండిపడ్డారు. దీంతో, మహాజన సభ రసాభాసగా మారింది. మ్యాక్స్‌ చట్టం వలన సభ్యులు తీవ్రంగా నష్టపోతారని, పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఏర్పడుతుందని సీనియర్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముందుగా సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకు ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్షన్‌ 12(3) కింద మూడింట రెండు వంతుల సభ్యుల సమ్మతి ఉండాలని, కానీ, మహాజన సభకు 70 మంది కూడా రాలేదని చెప్పారు. మ్యాక్స్‌ చట్టం వలన బ్యాంకు అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని, దీనిపై పాలకవర్గ సభ్యులకు సైతం తెలపలేదని బ్యాంకు డైరెక్టర్‌ గుత్తుల భాస్కరరావు తదితరులు చైర్మన్‌, సీఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాలూ తీవ్ర స్థాయిలో కేకలు వేసుకున్నాయి. ఒక దశలో అంతా రసాభాసగా మారింది. చివరకు బ్యాంకు చైర్మన్‌ కోళ్ల అచ్యుత రామారావు (బాబు) మాట్లాడుతూ, మ్యాక్స్‌ చట్టంపై కొంతమంది సీనియర్‌ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు మ్యాక్స్‌ చట్టంపై తీర్మానం చేయకుండానే మహాజన సభ ముగిసింది.

‘మ్యాక్స్‌’తో అపరిమిత అధికారాలు

ఆంధ్రప్రదేశ్‌ కో ఆపరేటివ్‌ చట్టం–1964 ప్రకారం సహకార బ్యాంకులు, సంఘాలపై ప్రభుత్వం నియమించిన కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌కు విస్తృత నియంత్రణాధికారాలుంటాయి. అలాగే, ఈక్విటీ లేదా ఆర్థిక సహాయం ద్వారా ఆయా సంఘాల్లో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది. పాలక మండలి రద్దు, సిబ్బంది నియామకం వంటి వాటిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఈ చట్టం పరిధిలోని సహకార బ్యాంకులు రిజర్వు బ్యాంకు పరిధిలో ఉంటాయి. అయితే, మ్యాక్స్‌ చట్టం–1995 ప్రకారం ఆయా బ్యాంకులు, సంఘాలు పూర్తి స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. పాలకవర్గ సభ్యుల చేతుల్లోనే పాలన ఉంటుంది. సంఘాలు తమ సొంత నియమాలను రూపొందించుకోవచ్చు. డైరెక్టర్లను నియమించుకోవడం, లాభాలు పంచుకోవడం కూడా పాలకవర్గం చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నియంత్రణ లేని కారణంగా బ్యాంకును ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ఆర్థిక అవకతవకలకు ఆస్కారమిస్తుందని సహకార సంఘాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు వార్షిక టర్నోవర్‌ సుమారు రూ.200 కోట్లు. ఈ బ్యాంకులో రూ.145 కోట్ల మేర డిపాజిట్లున్నాయి. సభ్యులు 17 వేల మంది ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే అంశాన్ని మహాజన సభ అజెండాలో పొందు పరిచారు. దీనికి ఆమోదం లభిస్తే సర్వాధికారాలూ చైర్మన్‌ చేతుల్లోకి వెళ్తాయి. డిపాజిట్లు, ఇతర వ్యవహారాలను బ్యాంకు పాలకవర్గం ఇష్టానుసారం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఎన్నికలు లేకుండా నచ్చినంత కాలం చైర్మన్‌ ఆ పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది. దీంతోపాటు, పాలకవర్గ సభ్యులుగా తనకు ఇష్టమైన వారిని నియమించుకునే అవకాశం ఉంటుంది. గత 20 ఏళ్లుగా చైర్మన్‌గా ఉన్న కోళ్ల బాబు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు బంధువు. ఆయనకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం ద్వారా బ్యాంకును పరోక్షంగా ఎమ్మెల్యే చేతిలో పెట్టినట్టేననే ఆరోపణలు వెల్లువెత్తాయి.

మార్గాని భరత్‌ ఫిర్యాదుతో..

ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మారిస్తే జరిగే ప్రమాదాన్ని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ గుర్తించారు. ఈ బ్యాంకును మాక్స్‌ చట్టంలోకి మార్చడం వలన డిపాజిట్లు, నియామకాలపై పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఉంటుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కీర్తి చేకూరికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని జిల్లా సహకార అధికారి వెంకట రమణను కలెక్టర్‌ ఆదేశించారు. సభ్యులు, డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నందున ఈ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను వాయిదా వేసుకోవాలని పాలక వర్గాన్ని ఆయన లిఖిత పూర్వకంగా ఆదేశించారు. అయినప్పటికీ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చేందుకు చైర్మన్‌, పాలకవర్గం ప్రయత్నాలు కొనసాగిస్తూండటంతో సీనియర్‌ సభ్యులు డిపాజిటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

సొంత జాగీరులా మార్చే యత్నం

ఇన్నీసుపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకును మ్యాక్స్‌ చట్టంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకును తమ సొంత జాగీరులా మార్చేందుకు చైర్మన్‌తో పాటు పాలకవర్గం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా అవకతవకలకు పాల్పడి మూసేసిన కో ఆపరేటివ్‌ బ్యాంకులు అనేకం ఉన్నాయి. బ్యాంకు ప్రస్తుతం పురోభివృద్ధి లేదు. మ్యాక్స్‌ చట్టంలోకి మారితే అంతా పాలకవర్గం ఇష్టారాజ్యమైపోతుంది. దీనిని డిపాజిటర్లు, బ్యాంకు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

– మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎంపీ, రాజమండ్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement