ఏరువాక .. సాగులేక | - | Sakshi
Sakshi News home page

ఏరువాక .. సాగులేక

Jun 29 2026 12:11 AM | Updated on Jun 29 2026 12:11 AM

కపిలేశ్వరపురం: అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి (జ్యేష్ట మాస పౌర్ణమి) నేడు. గతంలో ఏరువాక పౌర్ణమిని రైతులు పండగలా.. ఎంతో కోలాహలంగా చేసేవారు. కానీ, రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేకపోవడంతో అన్నదాతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 7,62,195 ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వారికి ఆదిలోనే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.

ఎన్నో ప్రతిబంధకాలు

● ముందస్తు సాగు కోసం ఈ నెల ఒకటో తేదీనే సాగునీరు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ, 28 రోజులైనా క్షేత్ర స్థాయిలో పొలాలకు నీరందని పరిస్థితి. సెంట్రల్‌ డెల్టాలో కాలువలపై పలు వంతెనలు నిర్మిస్తూండటంతో నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తూర్పు డెల్టాలోని మండపేట, కోరంగి కాలువల్లోనూ అదే పరిస్థితి.

● జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు ఏటా పంటల వారీగా రుణ పరిమితిని (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) నిర్ణయిస్తాయి. ఒక ఎకరా లేదా హెక్టార్‌ సాగుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, పంటను బట్టి రైతులు ఎకరాకు ఎంత రుణం పొందవచ్చో దీని ద్వారా నిర్ణయిస్తారు. ఇది ప్రస్తుత ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకూ నిర్ధారించారు. కానీ, రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఉదాహరణకు గడచిన రబీ సీజన్‌లో కాకినాడలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు రూ.914 కోట్ల మేర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.160 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ దృష్ట్యా ఈసారి కూడా తమకు రుణాలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఉండకపోవచ్చని, ప్రైవేటుగా అధిక వడ్డీలకే అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

● అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో హామీ ఇచ్చారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి దానిని రూ.14 వేలకు కుదించారు. అది కూడా చాలా మంది రైతులకు ఎగ్గొట్టారు. కౌలు రైతులకై తే పూర్తిగా ఎగనామం పెట్టారు.

● గత ఏడాది చివరిలో మోంథా, దిత్వా తుపాన్లు సంభవించాయి. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని 40,860 ఎకరాల్లో 33,262 మంది రైతులకు చెందిన వివిధ పంటలు దెబ్బ తిని, రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లాలోని సుమారు 52 వేల ఎకరాల్లో 46,900 మంది రైతులకు రూ.57.21 కోట్లు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సుమారు 73 వేల ఎకరాల్లో దాదాపు 41 వేల మంది రైతులకు రూ.73.86 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం అందించలేదు.

● మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. సూపర్‌ ఫాస్ఫేట్‌ బస్తా రూ.500 నుంచి రూ.700కు పెంచారు., పొటాష్‌ రూ.1,800 నుంచి రూ.1,975కు, కాంప్లెక్స్‌ ఎరువులు రూ.1,300 నుంచి రూ.1,600 వరకూ పెరిగాయి. పైగా, ఈ ఏడాది నుంచి ఎరువుల పంపిణీకి ప్రభుత్వాలు యాప్‌లు తీసుకొచ్చాయి. దీని ద్వారా ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే అది కూడా మూడు విడతలుగా ఇస్తామని చెబుతున్నారు. అంటే, అంతకంటే ఎక్కువగా ఎరువులు అవసరమైన రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేస్తున్నాయని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.50 మాత్రమే పెంచారు. ధరల భారంతో పాటు క్షేత్రస్థాయిలో దళారులు గద్దల్లా వాలిపోతూండటంతో.. మద్దతు ధర లభించక, ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ నష్టపోతున్నట్టు రైతులు చెబుతున్నారు.

● గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా అందించింది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. గత సీజన్‌లో హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు రూ.1,575 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాది మంది రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం అందక కుదేలవుతున్నారు. ప్రభుత్వం తీరుతో పలు ఇన్సూరెన్స్‌ కంపెనీలు రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టాయి.

● ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకునేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాలో 59,282, తూర్పు గోదావరి జిల్లాలో 1,15,718, కాకినాడ జిల్లాలో సుమారు 70 వేలు, పోలవరం జిల్లాలో వెయ్యి మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న లక్ష్యం అమలుకు దూరంగా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకమూ అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌ సాగు వివరాలు..

జిల్లా వరి సాగు విస్తీర్ణం

(ఎకరాలో)్ల

తూర్పు గోదావరి 2,40,000

కాకినాడ 2,36,435

కోనసీమ 1,68,760

పోలవరం 1,17,000 (అన్ని పంటలు)

ఫ దోబూచులాడుతున్న రుతుపవనాలు

ఫ పెరిగిన సాగు ఖర్చు

ఫ అందని ప్రభుత్వ సాయం

ఫ నేడు ఏరువాక పౌర్ణమి

ఫ రైతుల్లో నిర్వేదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement