కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పల్స్‌పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ఒక్క రోజు మొత్తం 1,73,581 మంది చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి బి.శ్రీదేవి తెలిపారు. మొత్తం 83.94 శాతం చిన్నారులకు మందు అందించామన్నారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. గతంలో పోలియో చుక్కలు వేయించినా ఇప్పుడు మరోసారి అదనంగా వేయించి, పిల్లలకు అంగవైకల్యం రాకుండా కాపాడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వసుంధర కోరారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పద్మా శశిధర్, డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి టీవీ చలపతిరావు, డీపీఎంఓ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఏపీ జేఏసీ అమరావతి సమావేశం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపాన ఉన్న రెవెన్యూ భవనంలో జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములుగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా, డివిజన్ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎం.కాంతిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏఆర్ శివకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ సమావేశానికి అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.
7 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
వై.రామవరం: మండలంలోని గుర్తేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సుమారు రూ.3.5 లక్షల విలువైన 7 కిలోల గంజాయిని గుర్తేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజకోటి తెలిపిన వివరాల మేరకు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు మండలం జి.కొత్తూరు గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నరసారావుపేటకు చెందిన రాజనాల కోటిరెడ్డి (62) ఈ సరకుతో పట్టుబడ్డాడు. సరకును దారకొండ నుంచి గుర్తేడు మీదుగా నరసారావుపేట తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు, గంజాయితో పాటు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.


