డీఎంహెచ్‌ఓ వసుంధర
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ఇటీవల కొన్ని ప్రాంతాలలో పేడరస్ డెర్మటైటిస్ (రోవ్‌బీటెల్/నైరోబీఫ్‌లై) వల్ల కలిగే చర్మవ్యాధిపై ప్రజలు ఆందోళనకు గురికావద్దని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.వసుంధర ఓ ప్రకటనలో తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, పేడరస్ అనే చిన్న పురుగు శరీరంపై నలిగినప్పుడు విడుదలయ్యే రసాయనం వల్ల ఈ చర్మ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. వర్షాకాలంలో, వ్యవసాయ పొలాలు, నర్సరీలు, తోటలు, పచ్చిక ప్రాంతాల్లో ఇవి ఉంటాయని, వీటి వల్ల ఎర్రటి మచ్చలు, మంట, దురద, చిన్న నీటి పొక్కులు, గీతల్లాంటి గాయాలు కావొచ్చని వివరించారు. ఇటువంటివి కనపడితే సమీప ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. కార్మికులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ సూచించారు.
చుక్కల మందుకు సర్వం సిద్ధం
● ఐదేళ్లలోపు చిన్నారులందరికీ
రెండు చుక్కలు
● 22 మండలాల్లో 1,126
బూత్‌ల ఏర్పాటు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఆరు నెలల క్రితమే పోలియో చుక్కలు వేసినా ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, వలసలు తదితర పరిస్థితులతో ముందస్తు చర్యగా ఆదివారం మరోసారి ఈ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా ఇమ్యూనిటీ అధికారి బి.శ్రీదేవి తెలిపారు. జిల్లాలో ––– మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ఈ మందు పంపిణీ చేసేందుకు 1,226 బూత్‌లు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 1,15,303 మంది, కొవ్వూరు డివిజన్‌లో 80,355 మంది, మండపేట డివిజన్‌లో 23,822 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 60 ట్రాన్సిట్ కేంద్రాలు, 60 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ ఈ మందు రెండేసి చుక్కలు వేయనున్నారు.
సోమేశ్వరునికి
హైకోర్టు జడ్జి పూజలు
నిడదవోలు: పట్టణంలోని పురాతన బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర ఆలయాన్ని ఏపీ హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సోమాల శివ ఆలయ మర్యాదలతో వారిని స్వాగతించారు. ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో జడ్జి కృష్ణమోహన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
డెల్టాలకు 9,593
క్యూసెక్కుల విడుదల
ధవళేశ్వరం: గోదావరి డెల్టా కాలువలకు శనివారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కాటన్ బ్యారేజీ వద్ద 8.15 అడుగులకు నీటి మట్టం చేరింది.
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్‌తో పాటు గోవిందా...గోవింద అంటూ భక్తులు గోదావరిలో తలారా స్నానం చేసి పునీతమయ్యారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువు దీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్‌కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
27ఎన్‌డీడీ 05
స్వామివారిని దర్శించుకుంటున్న
ఏపీ హైకోర్టు జడ్జి కృష్ణమోహన్


