● 86 శాతం లోటు వర్షపాతం
● వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం
● ఆందోళన చెందుతున్న అన్నదాతలు
● ఆకాశం వైపు ఆశగా చూపులు
దేవరపల్లి: రోహిణీ కార్తె వెళ్లింది. మృగశిర కార్తె వచ్చింది కదా వర్షాలు కురుస్తాయని అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కార్తె పూర్తి కావస్తున్నా ఎక్కడా చినుకు జాడే కానరావడం లేదు. ఫలితంగా పొలాల్లో తొలకరి సందడి కనిపించడం లేదు. ఈ పరిస్థితి చూసి రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికే పలుమార్లు వర్షాలు కురవగా.. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాన దేవుడు ముఖం చాటేశాడు. జూన్ నెల పూర్తయినా ఇప్పటి వరకూ సరైన వర్షాలు కురవలేదు. ఎండల తీవ్రత తగ్గడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటి వరకూ సాధారణ వర్షపాతం 60 మిల్లీమీటర్లు కాగా, 27 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీని ప్రకారం ఈ నెలలో వర్షపాతం లోటు 33 మిల్లీమీటర్లు. వర్షాలను నమ్ముకుని వరి ఆకుమడులు వేసిన రైతులు.. వాన దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరిలో దీర్ఘకాలిక పంట వేయకపోతే, ఈ నెలాఖరులోగా స్వల్పకాలిక పంట వేసుకోవడం మేలని అంటున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో, రైతులు వర్షాలు కురుస్తాయా లేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలా అనే మీమాంసలో పడ్డారు.
ఎండిన చెరువులు
జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు చెరువులు, కాలువలు, బోర్లపై ఆధారపడి ఖరీఫ్ సాగు చేస్తారు. ఈ సీజన్‌లో సరైన వర్షాలు కురవకపోవడం.. మరోవైపు సూర్య ప్రతాపం తగ్గకపోవడంతో పలు చెరువులు చుక్క నీరు లేనివిధంగా ఎండిపోయాయి. అనేక చెరువుల కింద ఆయకట్టు భూములు బీడువారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్ల నుంచి సైతం నీరు అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటికే వేసిన వరి చేలకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దుక్కి దున్ని మడిని సిద్ధం చేసినా.. తడి అందే దారి లేకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పంటల మార్పుపై దృష్టి
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, యూరియా కొరత, ధాన్యం అమ్మకాల్లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. అపరాలు, మినుము, మొక్కజొన్నతో పాటు, దీర్ఘకాలిక పంటలైన ఆయిల్‌పామ్ సాగుపై మొగ్గు చూపుతున్నారు. అధికారులు సైతం వరి సాగు తగ్గించి ఆయిల్‌పామ్ వేయాలని గ్రామగ్రామానా సదస్సులు పెట్టి మరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సుమారు 4,800 హెక్టార్లలో వరి పంటను తగ్గించి, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరుతో భవిష్యత్తులో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ పంటలు మేలు
ఫసిపిక్ మహాసముద్రం వద్ద వాతావరణం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో మన దగ్గర వర్షా లు 20 నుంచి 30 శాతం తగ్గుతాయి. ఖరీఫ్‌పై ఎండల ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నా య పంటలను ఎంచుకోవాలి. ఎల్‌నినో ప్రభావం తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. వరికి బదులు ఆయిల్‌పామ్ సాగు చేయాలి. దీర్ఘకాలిక పంటలు మానుకుని, స్వల్పకాలిక పంటలు వేసుకోవడం శ్రేయస్కరం.
– ఎ.మల్లికార్జునరావు,
జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం


