5 నుంచి సీఆర్‌సీలో యాక్టింగ్‌ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

5 నుంచి సీఆర్‌సీలో యాక్టింగ్‌ వర్క్‌షాప్‌

Jun 28 2026 12:16 AM | Updated on Jun 28 2026 12:16 AM

రావులపాలెం: ఔత్సాహిక కళాకారులు తమలోని నటనా నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రతి నిత్యం కృషి చేయాలని న్యూఢిల్లీ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ప్రతినిధి ఎల్‌వీ భూషణ్‌, సీఆర్‌సీ కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్‌సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, రావులపాలెం సీఆర్‌సీ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 5 నుంచి మూడు వారాల పాటు రెసిడెన్షియల్‌ యాక్టింగ్‌ వర్క్‌షాప్‌ను సీఆర్‌సీలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తిగా ఉచితంగా ఈ వర్క్‌ షాప్‌ నిర్వహిస్తామని, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు వారాలపాటు తరగతులు జరుగుతాయన్నారు. 15 ఏళ్లు పైబడి, 40 ఏళ్లలోపు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. జూలై 4వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రిజిస్ట్రేషన్‌ కోసం సీఆర్‌సీలో ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని వివరాల కోసం 96764 36363 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. దరఖాస్తులను బట్టి అవసరమైతే రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో కళాకారిణి లహరి, సీఆర్‌సీ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కరరెడ్డి(చిన్న బుజ్జి), ఆర్‌వీఎస్‌ రామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement