● విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం
● పోలవరం జిల్లాలో ఘటన
చింతూరు: యాత్రికులతో కలిసి విహార యాత్రకు బయలుదేరిన ఓ వ్యాను బోల్తా పడిన ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలో ఘాట్ రోడ్డు వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. వేమగిరికి చెందిన అమలదాస్ దుర్గ, జగ్గంపేటకు చెందిన అమలదాస్ లోవరాజు, మేడపాడుకు చెందిన బుల్లి వెంకన్న, గంటి పెదపూడికి చెందిన గాడా ప్రసాద్ కుటుంబాలకు చెందిన 23 మంది శుక్రవారం పోలవరం జిల్లా మారేడుమిల్లికి విహారయాత్రకు వ్యానులో బయలుదేరారు. ఉదయం 10 గంటల సమయంలో మారేడుమిల్లి వద్ద అల్పాహారం తిని జలతరంగిణి జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు లేకపోవడంతో పొల్లూరు జలపాతం వద్దకు వెళ్లాలని బయలుదేరారు. వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ శంకర్ బ్రేక్ వేస్తే పడకపోవడంతో మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. వ్యాన్ వెనుక భాగంలో ఉన్నవారంతా ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. రంపచోడవరం ఓఎస్డీ పంకజ్‌కుమార్ మీనా, ఏఎస్పీ బొడ్డు హేమంత్, సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శ్రీనివాస్‌దొర ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులు, ఇతర వాహనాల్లో చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో రాజు(10), షర్మిల రోజి(08)తో పాటు లోవబాబు, గోవిందమ్మ, మనోహర్, నాగదుర్గ, దేవి, నూతన తీవ్రంగా గాయపడడంతో వారిని మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. మిగిలినవారు చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పరిమితికి మించి ఎక్కించడం వల్లే..
వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి కారణమని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ అన్నారు. ఇకపై వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మారేడుమిల్లి, చింతూరు, చట్టి జంక్షన్ల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.


