డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

రాజమహేంద్రవరం సిటీ: మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టాలంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం దారుణమని వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదనే అంశంపై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదన్నారు. అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తగదని, ఇది ప్రజాస్వామ్యమా, నియంత పాలనా అనిపిస్తోందని దుయ్యబట్టారు. డీఎస్సీ అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐ విచారణ నిర్వహించాలని, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. నీట్‌ అక్రమాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం రూపుదాల్చినట్టుగానే రాష్ట్రంలో డీఎస్సీ వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే ఉద్యమం ఊపందుకుంటోందన్నారు. అందుకే చంద్రబాబు ముందే అప్రమత్తమై హుకుం జారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని వేళ్లూ విద్యా శాఖ మంత్రి వైపే చూపిస్తున్నందున ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబే ఆద్యుడన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ చేస్తామంటూ రష్యాలో లోకేష్‌ మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, అందులో పదో వంతు కూడా రాష్ట్ర ఎకానమీ లేదని భరత్‌రామ్‌ అన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మాటలు ఎక్కడికి వెళ్లిపోయాయో తెలియడం లేదని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందని చెప్పారు. దారుణమైన విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇంకా ఓటేయడంపై ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత మేలుకొని వాస్తవాలను గ్రహించాలన్నారు. ‘బీజేపీతో జత కట్టారు. విడిపోయారు.. మళ్లీ జత కట్టారు.. కాంగ్రెస్‌ను విమర్శించి, మళ్లీ ఆ పార్టీ పక్కనే చేరారు.. ఇలా చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తారు’ అని ఆయన ధ్వజమెత్తారు.

కార్పొరేషన్‌లో దారుణమైన అవినీతి

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో దారుణమైన అవినీతి జరుగుతోందని భరత్‌రామ్‌ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యే అనుయాయులకు నామినేషన్‌ పద్ధతిలో పనులు కట్టబెడుతున్నారని అన్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో నగర పాలక సంస్థ కమిషనర్‌ సమాధానం చెప్పాలని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు చెట్లకు ఇనుప ఊచలు కట్టి, పోస్టర్లు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. అనంతరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భరత్‌రామ్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలా?

వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో 45 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భరత్‌రామ్‌ ఆక్షేపించారు. గోదావరిలో కాలుష్యం పెరిగిపోయిందన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి రాజమహేంద్రవరంలో శాశ్వత నిర్మాణాల పనులు ఇప్పటి వరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో నగరంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టలేదన్నారు. అసలు ప్రభుత్వం వద్ద ఎటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలూ లేవని చెప్పారు. చిన్న వానకే రాజమహేంద్రవరం నగరం మునిగిపోతోందన్నారు. పుష్కర స్నానాలకు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారని, అంత మందికి ఇక్కడ ఏవిధంగా సౌకర్యాలు కల్పిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదకొండేళ్ల క్రితం పుష్కరాల మొదటి రోజే ప్రభుత్వ నిర్వాకంతో 29 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇప్పటికై నా రాజమహేంద్రవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తాను నగరానికి 55 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ ప్లాంట్‌ నిర్మాణానికి నిధులు తీసుకువచ్చామని, ఆ పనులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని భరత్‌రామ్‌ ధ్వజమెత్తారు. నగరాన్ని మూడుసార్లు టీడీపీ మేయర్లే పాలించారని, ఒక్కరు కూడా ఇటువంటి ప్లాంట్‌ నిర్మించలేకపోయారని విమర్శించారు.

ఫ ఫస్ట్‌ ర్యాంకర్‌కు ఉద్యోగం

ఎందుకివ్వలేదో చెప్పాలి

ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

Advertisement
 
Advertisement
Advertisement