● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు
● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం
● భక్తులకు రుచికరమైన భోజనం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గ్యాస్ సెగ ఆమడ దూరంలో ఉంది. ఈ పథకం 2009లో మొదలై నేటికీ నిరాఘాటంగానే భక్తులకు భోజన వసతి కల్పిస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని పాటిస్తూ స్వామి దర్శనానికి తరలివస్తున్న భక్తులందరికీ కడుపునిండా రుచికరమైన వంటకాలతో సిబ్బంది వండి పెడుతున్నారు.
కేవలం 25 నిమిషాల్లోనే..
కేవలం 25 నిమిషాల్లోనే 110 కేజీల బియ్యం ఉడికేటట్టుగా ఒకేసారి స్టీమ్‌పై పనిచేసే స్టీల్ కుక్కర్లతో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆర్వో ప్లాంటు ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ క్షేత్రంలో అన్నదాన పథకానికి పుష్కర కాలం పైబడి జీడిపిక్కల పొయ్యితో ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టం, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో పూర్తిగా కలసి వచ్చింది. కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే వంటలు వండుతున్నారు.
తక్కువ సమయంలో అన్నం తయారీ
ఇక్కడ స్టీమ్ సిస్టంలో జీడిపిక్కల పొయ్యికి చేరి అంతర్గతంగా ఉన్న నీటి తొట్టెలోని నీళ్లు మరగకాగి తద్వారా వచ్చే స్టీమ్‌ను గొట్టాలతో స్టీల్ కుక్కర్లలోకి పంపుతున్నారు. జీడిపిక్కల పొయ్యి నుంచి వచ్చే పొగను ప్రత్యేక గొట్టం ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేశారు. పిక్కల పొయ్యిపై పప్పును ఉడికించి సాంబారు సిద్ధం చేస్తున్నారు. అలాగే పిక్కల పొయ్యిలపై సలసలా కాగే నీటిలో బంగాళాదుంపలు, ఇతర కాయగూరలు ఉడికిస్తున్నారు. స్టీమ్ ద్వారా ఒక్కో కుక్కర్లో 25 నిమిషాల్లోనే వేడి వేడి అన్నం సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు గ్యాస్ పొయ్యి మీద కంటే త్వరితగతిన స్టీమ్ ద్వారా స్టీల్ కుక్కర్లలో అన్నం క్షణంలో వండి వారుస్తున్నారు.
26 కేజీల బియ్యం కట్ట 150 మందికి చొప్పున
సాధారణ రోజుల్లో రెండు వేల మంది భక్తులు, వారాంతపు సెలవుల్లో నాలుగు వేలకు పైబడి భక్తులు భోజనం చేస్తున్నారు. అదే పర్వదినాల్లో పది వేల మందికి భోజనం చేస్తున్నారు. 26 కేజీలు ఉన్న ఒక బియ్యం కట్ట 150 మందికి సరిపోతుంది. ఈ క్రమంలో సాధారణ రోజుల్లో 10 నుంచి 15 కట్టలు, వారంతపు రోజుల్లో 25 కట్టలు, పర్వదినాల్లో 40 కట్టల బియ్యాన్ని వారుస్తున్నారు. కాగా స్టీమ్ సిస్టమ్ ఉండడంతో ఇతర అవసరాలకై రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. నిత్యాన్నదాన పథకానికి, అర్చకులు స్వామికి నివేదన చేసే ప్రసాదాల తయారీకి ఈ రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆలోచన
రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు మదిలో నాడు మెదిలిన ఈ ఆలోచనను స్థానిక దాతలు, భక్తులు, నాయకులు ప్రోత్సహించారు. లక్ష్మీనృసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌ను 2009 అక్టోబరు 28న ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభించిన మొదటి నెల రోజులు జంపన రామరాజు కుమారులు జంపన సత్యనారాయణ రాజు, వెంకట రంగరాజు కలిపి భక్తులకు సొంత విరాళాలతో అన్నదానం అమలు చేశారు. పప్పు, సాంబారు, పెరుగుతో ప్రారంభమైన అన్నదాన పథకం తదనంతరం కూరలు, పచ్చళ్లు, బూరెలు, పులిహోర, పసందైన వంటకాలకు చిరునామాగా మారింది.
అంతర్వేది క్షేత్రంలో స్టీమ్‌పై పనిచేసే స్టీల్ కుక్కర్లు
పథకం వద్ద గ్యాస్ పొయ్యిలపై వంటకాల తయారీ
ఇరాన్‌తో అమెరికా–
ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మన దేశానికి రావలసిన చమురు, ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో వాటితో పాటు దేవాలయాల్లో నిత్యాన్నదానాలపైనే ఈ ప్రభావం పడింది. కానీ అంతర్వేది దేవస్థానంలో అధికారులు, నాయకులు పదిహేనేళ్ల ముందు చూపు కారణంగా అన్నదానం ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది.
ఆలయానికి గ్యాస్ కొరత లేదు
క్షేత్రంలో ప్రస్తుత తరుణంలో గ్యాస్ కొరత లేదు. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరమవుతున్నాయి. నిత్య అన్నదాన పథకానికి, స్వామివారికి నివేదించే ప్రసాదాల తయారీకి రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నాం. నిత్యాన్నదాన పథకానికి గ్యాస్‌తో సమానంగా స్టీమ్ సిస్టం క్షేత్రంలో కొనసాగుతోంది. భక్తులకు రుచికరమైన భోజనాన్ని వండి పెడుతున్నాం.
– ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, ఆలయ ఏసీ,
అంతర్వేది దేవస్థానం


