● చారిత్రక రాజమహేంద్రవరంలో
శాంతిభద్రతలపై తీవ్ర చర్చ
● వరుస ఘటనలతో ప్రజల ఆందోళన
● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి
● చిరు వ్యాపారులకు ప్రజా ప్రతినిధుల పేర్లతో బెదిరింపులు
● ఓ మ్యారేజ్ కార్యాలయంలోకి ప్రవేశించి దుండుగుల దాడులు
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టు తప్పుతున్నాయా? రౌడీషీటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు.. యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న ఘటనలే దర్శనం. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నామని పోలీసులు చెబుతున్నా.. చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఇవీ తార్కాణాలు
చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
● చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ రాజకీయ నేతల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.30ల బన్ను అమ్ముకోవాలన్నా.. రాజకీయ నాయకుల అనుమతులు తీసుకోవాలా..? అని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కమీషన్లు ఇవ్వని వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులపై బాగా వినిపిస్తున్నాయి.
● తాను ఓ ప్రదేశంలో నిల్చుంటే మా ఆయనను పక్కకు తోసేసి నా మెడపై బ్లేడ్‌తో దాడి చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
● నగరంలో కూటమికి చెందిన ఓ నేత ఆరు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల పేకాట శిబిరాలపై పోలీసులు చేసిన దాడుల్లో రూ.కోట్లు పట్టుబడినా.. కూటమి నేత కావడంతో బయటకు రాకుండా తొక్కిపెట్టి కేస్‌ను క్లోజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక గంజాయి, మత్తు మందుల చలామణీ పెరిగిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
● ఇటీవల రాత్రి సమయంలో ఓ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలోకి చొరబడి కొందరు దుండగులు వీరంగం సృష్టించినట్టు స్థానికులు చెబుతున్నారు.
గతంలోనూ...
● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దివాన్‌చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్‌పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్‌పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
● ఇటీవల తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసు అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు.
● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కొని పరాయయ్యాడు.
● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్‌కు సంబంధించిన రీసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది.
శాంతి భద్రతలకు ప్రాధాన్యం
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. బహిరంగంగా మద్యం తాగేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల సరఫరాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం.
– డి.నరసింహ కిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి
పోలీసులపైనే దాడులు
రాజమహేంద్రవరంలో కొన్ని మాసాల క్రితం ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోమ్ గార్డ్ రోడ్డుపై హల్‌చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కు ని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో... పోలీసు శాఖ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. బహిరంగంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
రాజమహేంద్రవరంలో బరితెగింపు
రాజమహేంద్రవరం నగరంలో రాత్రివేళల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరితెగిస్తున్న రౌడీ షీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెరపోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీ షీటర్ల చేతిలో తన్నులు తిన్న సంఘటనలు రాజమహేంద్రవరం వాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.


