
ఎగసిపడి..
దేవరపల్లి: ఆశలు కల్పించి.. నిరాశలో ముంచేస్తే.. ఆ వేదన.. అనుభవించే వారికే తెలుస్తుంది. పొగాకు రైతుల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. మొదట్లో చెప్పుకోదగిన ధర రాక డీలా పడ్డారు. కొన్నాళ్ల తరువాత గణనీయంగా పెరిగిన ధరను చూసి ఆశలు పెంచుకున్నారు. మార్కెట్ ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్తు బాగుంటుందని భావించారు. అంతలోనే వారి ఆశలపై మార్కెట్ పరిస్థితులు నీళ్లు జల్లేశాయి. చూస్తూండగానే ధర దిగజారిపోవడంతో పొగాకు రైతులు అయోమయంలో పడ్డారు.
ధర పెరిగి.. తగ్గిందిలా...
● 2024–25 పంట కాలానికి సంబంధించిన పొగాకు కొనుగోళ్లు గత మార్చి 24న ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు గరిష్టంగా రూ.290 పలికింది. ఇది జూన్ 25 వరకూ కొనసాగింది.
● జూన్ 26న ఒక్క రూపాయి పెరిగి రూ.291కి చేరింది.
● అనంతరం, ధర రోజురోజుకూ పెరుగుతూ జూలై 16న ఏకంగా రూ.392కు చేరింది. దీంతో, రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకే రోజు కిలోకు ఏకంగా రూ.38 పెరగడం వారికి ఊరటనిచ్చింది. గత ఏడాది కిలో గరిష్ట ధర రూ.410 పలకడంతో పొగాకు రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా గరిష్ట ధర రూ.400 దాటుతుందని రైతులు ఆశించారు.
● అయితే, రూ.392 ధర రెండు రోజులు కొనసాగి, జూలై 17న రూ.390కి తగ్గింది. అంటే రూ.2 తగ్గింది. అదే ధర జూలై 25 వరకూ కొనసాగింది.
● జూలై 26వ తేదీన ఒకేసారి రూ.20 తగ్గి, రూ.370కి పడిపోయింది. అదే ధర ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగింది.
● శనివారం నాడు మరో రూ.20 తగ్గి, కిలో పొగాకు గరిష్ట ధర రూ.350కి పడిపోయింది. దాదాపు 20 రోజుల పాటు రూ.370 పలికిన ధర ఒకేసారి రూ.350కి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధరయినా కొనసాగుతుందా.. ఇంకా పడిపోతుందా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధిక ధరకు బ్యారన్లను అద్దెకు, భూములు కౌలుకు తీసుకున్న రైతులు మార్కెట్ పరిస్థితులు చూసి అయోమయావస్థను ఎదుర్కొంటున్నారు.
పెరిగిన బ్యారన్ అద్దె
పొగాకు సాగుకు సంబంధించి 2025–26 పంట కాలానికి భూముల కౌలు, బ్యారన్ అద్దెలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఎకరం పొలం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె (లైసెన్స్) రూ.1.60 లక్షల చొప్పున పలికాయి. ఈ ధర ఈ ఏడాది మరింత పెరిగింది. ప్రస్తుతం ఎకరం భూమి కౌలు రూ.70 వేల నుంచి రూ.80 వేలు పలుకుతూండగా, బ్యారన్ అద్దె రూ.2 నుంచి రూ.3 లక్షల వరకూ పలుకుతున్నట్టు సమాచారం. ఇంత భారీ ధరలు చూసి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. 2022–23లో పొగాకు ధర గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు బ్యారన్లను విక్రయించారు. ఒక్కో బ్యారన్‌ను రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు అమ్ముకున్నారు. వాటిని కొనుగోలు చేసిన రైతులు తమ పేరిట పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ తరువాతి సంవత్సరం అంటే.. 2023–24లో బ్యారన్ ఖరీదు ఏకంగా రూ.8 లక్షలు పలికింది. దీంతో బ్యారన్లను అమ్ముకున్న రైతులు కంగుతిన్నారు. ఈ ఏడాది బ్యారన్ అద్దె రూ.3 లక్షలు పలకడంతో రెండేళ్ల క్రితం వాటిని అమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది బ్యారన్ ఖరీదు సుమారు రూ.10 లక్షలు పలుకుతున్నట్టు సమాచారం.
46.17 మిలియన్ కిలోల విక్రయం
ప్రస్తుత సీజన్‌లో పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.1,362 కోట్ల విలువైన 46.17 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 7.82 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 10.20, జంగారెడ్డిగూడెం–2లో 9.85, కొయ్యలగూడెంలో 9.39, గోపాలపురం వేలం కేంద్రంలో 6.93 మిలియన్ కిలోల చొప్పున విక్రయాలు జరిగాయి. మొత్తం 3,59,920 బేళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
పతనమైన పొగాకు ధర
కిలోకు రూ.391 నుంచి
రూ.350కి తగ్గుదల
రూ.41 తగ్గిపోవడంతో రైతుల్లో అయోమయం
కొనుగోలుదారుల మధ్య పోటీ
తగ్గడమే కారణం
ఒడుదొడుకుల్లో మార్కెట్
పొగాకు మార్కెట్ ఒడుదొడుకుల్లో సాగుతోంది. ధర నిలకడగా లేదు. పొగాకు ధర తగ్గితే రైతుకు గిట్టుబాటు కాదు. కిలో గరిష్ట ధరను రూ.392 నుంచి రూ.350కి తగ్గించారు. అదేమని అడిగితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. గరిష్ట ధర రూ.392 పలకడంతో వచ్చే ఏడాదికి సంబంధించిన భూముల కౌలు, బ్యారన్ల అద్దెలు పెరిగాయి. కౌలు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. కౌలుదారులు ఆచితూచి భూములు, బ్యారన్లు తీసుకోవడం మేలు.
– కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు, పొగాకు
వేలం కేంద్రం రైతు సంఘం, దేవరపల్లి
ముందు ముందు చెప్పలేం
మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ తగ్గి, ధర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్‌తో పాటు, ఎగుమతి ఆర్డర్లు తగ్గడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి దేశవ్యాప్తంగా పెరిగింది. కొనుగోలుదారుల అవసరం మేరకు కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ ధర గిట్టుబాటు కాదని ట్రేడర్లు అంటున్నారు. మార్కెట్లో కొనుగోలుదారులు పోటీ పడే పరిస్థితి లేదు. కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. మరో రెండు నెలల్లో కర్ణాటక, బ్రెజిల్‌లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ముందు ముందు మార్కెట్ పరిస్థితి చెప్పలేం.
– జీఎల్‌కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం

ఎగసిపడి..

ఎగసిపడి..