పొగాకు గిట్టుబాటు ధర కోసం 22న ధర్నా
ఫ దేవరపల్లి వేలం కేంద్రం వద్ద
ఆందోళన
ఫ వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
దేవరపల్లి: పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఈ నెల 22న ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు రైతులతో కలసి ఈ ఆందోళన చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు విలవిలలాడుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన భారీ ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాజా కోరారు.
అర్జీదారులకు ఎండార్స్‌మెంట్లు తప్పనిసరి
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో అందజేసిన అర్జీలకు సంబంధించి ఫిర్యాదీలకు ఎండార్స్‌మెంట్లు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఆడిట్ నివేదిక ప్రకారం 50 శాతం మంది అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ చేరడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ సీతారామమూర్తి, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖకు సంబంధించి 127, పంచాయతీరాజ్ 40, పోలీసు 30, వ్యవసాయం 16, ఇతర శాఖలకు సంబంధించి 73 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఫిర్యాదుల్లో రెవెన్యూ, సర్వే శాఖలవే అధికంగా ఉంటున్నాయని, తర్వాతి స్థానాల్లో పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖలున్నాయని తెలిపారు. పరిష్కారం చూపలేని అంశాలకు కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సమకూర్చిన రూ.25 వేల విలువైన కృత్రిమ అవయవాలను ముగ్గురు మహిళలు, ఒక పురుషునికి కలెక్టర్ ప్రశాంతి అందజేశారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)కు 40 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా క్రైం బ్రాంచి (డీసీఆర్‌బీ) ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. నగరంలోని లూథర్‌గిరి అయాన్ డిజిటల్ జోన్‌లో జరిగిన ఈ పరీక్షలకు 92.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 649 మందికి 594 మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 657 మందికి గాను 610 మంది హాజరయ్యారు. మొత్తం 1,300 మందికి గాను 1,204 మంది పరీక్షలు రాశారు.
పొగాకు గిట్టుబాటు ధర కోసం 22న ధర్నా
పొగాకు గిట్టుబాటు ధర కోసం 22న ధర్నా


