‘చిన్నారి ఆరోగ్యం’ భేష్
● గెయిల్ సీఎస్‌ఆర్ నిధులతో
నూతన కార్యక్రమం
● ప్రారంభించిన మంత్రి దుర్గేష్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా ‘చిన్నారి ఆరోగ్యం’ కార్యక్రమం ప్రారంభించడం మంచి పరిణామమని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గెయిల్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన దాదాపు 74,238 మంది చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయడం సంతోషకరమన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 1,448 మంది పిల్లలు అతి తీవ్ర పోషకాహారం లోపంతో, 95 మంది తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని తెలిపారు. వీరిని ప్రతి బుధవారం బాలమిత్రలు సందర్శించి వారి ఎత్తు, బరువు, ఆరోగ్య స్థితిని పరీక్షించి, చిన్నారి ఆరోగ్య యాప్‌లో అప్‌లోడ్ చేస్తారన్నారు. ఈ పిల్లలకు నెలకోసారి పోషకాహారం కిట్లు పంపిణీ చేస్తారన్నారు. గెయిల్ జనరల్ మేనేజర్ వైఏ కుమార్ మాట్లాడుతూ, చిన్నారులకు సంపూర్ణ పోషణ కూడిన ఆహారం అందజేసేందుకు తమ సంస్థ ద్వారా రూ.38 లక్షల ఆర్థిక చేయూత అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, గెయిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు దీవి ప్రభాకర్ (హెచ్‌ఆర్), కె.రాజన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి కె.విజయ కుమారిని సన్మానించారు. చివరిలో బాలింతలకు సీమంతం, చిన్నారులకు గ్రాడ్యుయేషన్ నిర్వహించారు. పిల్లల తల్లులకు పోషకాహార కిట్లు అందజేశారు.
వీరమరణం పొందిన సైనికులకు నివాళి
తొలుత పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, పాక్ కాల్పుల్లో రాష్ట్ర జవాన్ మురళీ నాయక్ వీరమరణం కలచివేసిందని నివాళులర్పించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘భారత్ మాతాకీ జై, జై జవాన్ అని నినదించారు.


