డ్వాక్రా మహిళలకు రూ.15.33 కోట్ల నమూనా చెక్కు అందిస్తున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, హాజరైన డ్వాక్రా మహిళలు
దేవరపల్లి: ముఖ్యమంత్రి జగనన్న సారథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ సంక్షేమ పాలన నడుస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్‌రామ్ అన్నారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత రుణమాఫీ నమూనా చెక్కు పంపిణీ కార్యక్రమం మంగళవారం దేవరపల్లిలోని ఏఎస్సార్ జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగింది. వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కూచిపూడి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎంపీ భరత్‌రామ్ ముఖ్య అతిఽథిగా హాజరై ప్రసంగించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 80 లక్షల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.25 వేల కోట్ల రుణమాఫీని నాలుగు విడతల్లో జగనన్న చెల్లిస్తున్నారన్నారు. ఇప్పటికే మూడు విడతల నిధులను విడుదల చేశారన్నారు.
నియోజకవర్గంలో రూ.227 కోట్ల రుణమాఫీ
గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ఆరు వేల డ్వాక్రా గ్రూపుల మహిళలకు నాలుగు విడతల్లో రూ.227 కోట్ల రుణమాఫీ జరుగుతుందన్నారు. మూడు విడతల్లో ఇప్పటి వరకూ రూ.190 కోట్లను వారి ఖాతాలకు విడుదల చేశారన్నారు. నియోజకవర్గంలో 20 వేల మంది పేదలకు ఇంటి పట్టాలు అందజేశామని చెప్పారు. దేవరపల్లి మండలంలో మూడో విడత 1661 స్వయం సహాయక సంఘాలకు రూ.15.33 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అనంతరం వేదికపై డ్వాక్రా మహిళలకు రూ.15.33 కోట్ల నమూనా చెక్కును ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే వెంకట్రావు అందజేశారు. సీఎం జగనన్న సందేశాన్ని ఎంపీ భరత్‌రామ్ చదివి వినిపించారు. సుమారు ఐదు వేల మంది మహిళలతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. తొలుత వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీకే దుర్గారావు, సర్పంచ్ కడిమి వీరకుమారి, ఏఎంసీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు గారపాటి రమాప్రభ, మండల మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి పాల్గొన్నారు.
ఎంపీ మార్గాని భరత్‌రామ్
డ్వాక్రా మహిళలకు
వైఎస్సార్ ఆసరా చెక్కు అందజేత
పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి


