ఓటుకు పెంచాయతీలు | - | Sakshi
Sakshi News home page

ఓటుకు పెంచాయతీలు

Nov 29 2026 12:08 AM | Updated on Nov 29 2026 12:08 AM

● ఓటర్లకు భారీగా ప్రలోభాలు

● తొలి దశ పంచాయతీల్లో

అంచనాలు తలకిందులు

● ఓటమి భయంతో కూటమి ఎత్తుగడలు

● రెండో దశ ఫలితాలపై ఆందోళన

సాక్షి, అమలాపురం: జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు కూటమి అంచనాలను తలకిందులు చేశాయి. పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించడంతో కూటమి శిబిరంలో గుబులు మొదలైంది. పట్టణ, పరిషత్‌ ఎన్నికల వలే ఫలితాలు వస్తాయని ఆశించిన కూటమి మద్దతుదారులకు పంచాయతీలకు వచ్చేసరికి చావుదెబ్బ తగలడంతో గెలుపుపై బెరుకు వచ్చింది. దీనితో ఓటు రేటు భారీగా పెంచడంతో పాటు వలస ఓటర్లను రప్పించేందుకు నానా హైరానా పడుతున్నారు.

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. మొత్తం 148 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు 38 పంచాయతీలు గెలుచుకున్నారు. వీటిలో కీలకమైన మేజర్‌ పంచాయతీలతో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, వారి ముఖ్య అనుచరులు పోటీ చేసిన గ్రామాలను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాలతో పాటు పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలంలోనూ వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు మంచి ఫలితాలు సాధించారు. అమలాపురంలో ఐదు, అల్లవరంలో ఐదు, మలికిపురంలో ఆరు పంచాయతీలు గెలవడం వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఇది కూటమికి మింగుడుపడడం లేదు. దీనితో రెండో దశ ఎన్నికల ఫలితాలు మరింత వ్యతిరేకంగా వస్తాయనే భయం పట్టుకుంది. దీని వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓటు రేటు గణనీయంగా పెంచేశారు.

ఓటుకు రూ.ఆరు వేలు

కె.గంగవరం మండలంలో ఊడుమూడిలో ఓటుకు రూ.ఆరు వేల వరకు పలుకుతోంది. ఇక్కడ జనసేన మద్దతుదారులు ఇద్దరు తలపడుతున్నారు. నోటుతో పాటు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ రింగ్‌ కూడా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతంలో ఉన్నవారికి రూ.పది వేల వరకు ఇచ్చి ఓటర్లను రప్పించుకుంటున్నారు. ఆత్రేయపురంలో అయితే ఓటుకు రూ.నాలుగు వేల వరకు పంచుతున్నారు. అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీలో కూటమి మద్దతుదారుడు ముందు ఓటుకు రూ.వెయ్యి చొప్పున అందించారు. అది సరిపోదని మరో రూ.ఐదు వందలతోపాటు చీరలు కూడా పంపిణీ చేస్తున్నారు. పి.గన్నవరం మండలం పి.గన్నవరం, ఊడిమూడి, అయినవిల్లి మండలం అయినవిల్లి వంటి పంచాయతీల్లో హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటుకు రేటు బలంగా ఉంది.

పంచుతూ.. పెంచుతూ..

రావులపాలెం, గోపాలపురం అయితే ఓటుకు రూ.వెయ్యి నుంచి డిమాండ్‌ను బట్టి కొన్ని ఓట్లకు రూ.2,500ల వరకు పంపిణీ జరుగుతోంది. కొత్తపేటలో కూడా కూటమి తరఫున పోటీలో ఉన్న టీడీపీ మద్దతుదారుడు తొలుత రూ.500 అనుకుని రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నారు. ఇక్కడ రెబల్‌గా పోటీ చేస్తున్నవారు రూ.500 చొప్పున ఇస్తున్నారు. ఆలమూరు జొన్నడ, పెదపల్లి, చింతలూరులో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు అందిస్తున్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ, వెల్లంపాలెం, వెంకటాయపాలెం, వెల్ల, కె.గంగవరం మండలం దంగేరు, రామచంద్రపురం నియోజకవర్గం పరిఽధి కాజులూరులో ఓటుకు రూ.రెండు వేల చొప్పున అందిస్తున్నారు. ఇది సరిపోవడం లేదని రాత్రికి మరో రూ.వెయ్యి చొప్పున పంచేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement