ఓట్ల పండగకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల పండగకు సిద్ధం

Nov 29 2026 12:08 AM | Updated on Nov 29 2026 12:08 AM

సాక్షి, అమలాపురం: పల్లెపోరు రెండో దశకు రంగం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల సందడి ముగియడంతో ఇప్పుడు రెండో విడత సమరానికి పల్లెలు సన్నద్ధమయ్యాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఒకవైపు పోలింగ్‌ సామగ్రి పంపిణీ, మరోవైపు పోలీసు బందోబస్తు.. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.. ఇలా అన్ని ఏర్పాట్లతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారు.జిల్లాలో కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని తొమ్మిది మండలాల్లో శనివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 165 పంచాయతీలకు గాను వీటిలో 17 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 148 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌, కౌంటింగ్‌ జరుగనుంది. అలాగే 695 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా.. 1,167 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మొత్తం 2,362 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నారు.

5.24 లక్షల మంది ఓటర్లు

రెండో విడత ఎన్నికల్లో మొత్తం 5,24,488 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2,61,475 మంది పురుషులు, 2,63,000 మంది మహిళలు, 13 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,525 మంది అధికంగా ఉండటం విశేషం. జిల్లాలో 1,936 పోలింగ్‌ కేంద్రాల్లో 230 అత్యంత సమస్యాత్మక, 259 సమస్యాత్మక, 1,447 సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

5,814 మందితో ఎన్నికల నిర్వహణ

ఎన్నికల విధుల కోసం మొత్తం 5,814 మంది అధికారులను నియమించారు. వీరిలో 23 మంది జోనల్‌, 53 మంది రూట్‌, 57 మంది స్టేజ్‌–1 రిటర్నింగ్‌, 165 మంది స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారులు, ఐదుగురు చొప్పున స్టేజ్‌–1, 2 అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు. వీరితో పాటు 1,936 మంది ప్రిసైడింగ్‌, 3,445 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, 120 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

పోలింగ్‌ సామగ్రి పంపిణీ పూర్తి

పంచాయతీ ఎన్నికలు జరిగే మండల కేంద్రాల నుంచి ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రితో పాటు పోలీసు భద్రతా సిబ్బంది, రూట్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను విధులకు తరలించారు.

నేడే రెండో దశ పల్లెపోరు

జిల్లాలో 165 పంచాయతీల్లో ఎన్నికలు

5.24 లక్షల మంది ఓటర్లు,

1,936 పోలింగ్‌ కేంద్రాలు

5,814 మంది ఎన్నికల

సిబ్బందితో ఏర్పాట్లు పూర్తి

ప్రశాంత పోలింగ్‌కు చర్యలు : కలెక్టర్‌

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్‌ సజావుగా సాగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement