ఓపిక... పట్టక! | - | Sakshi
Sakshi News home page

ఓపిక... పట్టక!

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

సుస్తీ చేస్తే ఓపిక పట్టాల్సిందే... గంటల తరబడి నిరీక్షించాల్సిందే.. నాడి పట్టే వైద్యులు లేక అవస్థలు పడాల్సిందే.. ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఆధారంగా ఉన్న రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌)లో పరిస్థితి ఇది. రోజుకు వేల సంఖ్యలో రోగులు వస్తున్నా, సౌకర్యాల కల్పనలో వెనుకబాటే కనిపిస్తోంది. గత జగన్‌ హయాంలో అందరికీ ఆరోగ్య సేవలు అందగా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సేవల్లో జాప్యం వెంటాడుతోంది.

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్‌)కి సుస్తి చేసింది. ఆరోగ్య సేవలు అందించే చేతుల కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఈ ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. నిత్యం 2 వేల మందికి పైగా ఔట్‌ పేషెంట్లు, సుమారు 500 మందికి పైగా ఇన్‌ పేషెంట్లతో రద్దీగా ఉండే ఈ ఆసుపత్రిలో కీలక విభాగాలకు వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యాధునిక వైద్య విభాగాలు అందుబాటులోకి వచ్చినా వాటికి అవసరమైన నిపుణుల నియామకాలు పూర్తి జరకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే మెరుగైన వైద్య సేవలు అందాయని రోగులు అంటున్నారు.

నియామకాలపై నిర్లక్ష్యం

గుండె సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కిడ్నీ, న్యురాలజీ, న్యూరో సర్జరీ, యురాలజీ, క్యాన్సర్‌ చికిత్స వంటి కీలక విభాగాల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఆయా విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొందరు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు 2023లోనే నిపుణుల నియామకాలు చేపట్టాల్సి ఉంది. 2024 జనవరిలో రేడియేషన్‌, సర్జికల్‌, మెడికల్‌ ఆంకాలజీ విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకాలు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. కీలకమైన గుండె, గ్యాస్ట్రో తదితర విభాగాలకు సైతం నిపుణుల కొరత వేధిస్తోంది.

14 మంది ప్రొఫెసర్లు అవసరం

మొత్తం ఏడు విభాగాలకు 14 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు కేటాయించగా న్యూరో సర్జరీ విభాగంలో మాత్రమే ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పని చేస్తున్నట్లు సమాచారం. నెఫ్రాలజీ విభాగానికి వైద్యుడు లేకపోవడం గమనార్హం. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన రేడియేషన్‌, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాల్లో ఒక్కో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాత్రమే ఉన్నారు. మెడికల్‌ ఆంకాలజీ విభాగానికి వైద్యుడి నియామకం జరగలేదు. ఒక్కో విభాగానికి 12 నుంచి 20 మంది వరకు సిబ్బంది అవసరమున్నా నియామకాలు చేపట్టకపోవడం సేవలపై ప్రభావం చూపుతోంది.

ఖాళీలతో సతమతం

సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో హెడ్‌ నర్సులు 7, స్టాఫ్‌ నర్సులు 21, ఫిజియోథెరపిస్టులు 2, స్వీపర్లు 2, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్లు 4, సీటీ, డయాలసిస్‌, ఈఈజీ టెక్నీషియన్లు 6, ఇతర సిబ్బందికి సంబంధించిన 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కథనంలో పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కొరత కారణంగా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది.

క్రిటికల్‌ కేర్‌ చూపక..

కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ (సీసీబీ) పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికే వైద్యులు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసుపత్రిలో అదనపు సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా, వాటిని సమర్థంగా వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ పెద్దాసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే కేటాయించిన పోస్టుల్లో నియామకాలు చేపట్టాలి. రూ.కోట్లతో నిర్మించిన వైద్య మౌలిక సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

రాజమహేంద్రవరం

జీజీహెచ్‌లో సమస్యలు కోకొల్లలు

జగన్‌ హయాంలో అభివృద్ధికి బాటలు

చంద్రబాబు ప్రభుత్వంలో ఉత్తి మాటలు

సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అందని వైద్య సేవలు

రోజూ 2 వేలకు పైగా ఓపీ..

500 మందిపైగా ఇన్‌ పేషెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement