గోదావరిలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో యువకుడి గల్లంతు

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

సీతానగరం: మండలంలోని మునికూడలి వద్ద గోదావరిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రాజంపేటకు చెందిన కలిదిండి రాజేష్‌ (19) మునికూడలిలోని రేవులో బుధవారం నీట మునిగిన పడవను నెట్టాడు. ఈ క్రమంలో అదుపుతప్పి గోదావరిలో పడిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు కరుటూరి శ్రీహరిబాబు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు. రాజేష్‌కు తండ్రి వెంకయ్య, తల్లి కొండమ్మ, తమ్ముడు వినేష్‌ ఉన్నారు.

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ముమ్మిడివరం: 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవిలంక వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తలంక గ్రామానికి చెందిన బొక్కా జార్జి ప్రసాద్‌ మోటారు సైకిల్‌పై మురమళ్ల వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, యానాం నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జార్జి ప్రసాద్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెహ్రెయిన్‌ నుంచి

స్వగ్రామానికి బాధిత మహిళ

రాజోలు/ అమలాపురం రూరల్‌: ఉపాధి నిమిత్తం బ్రెహెయిన్‌ వెళ్లి మోసపోయిన రాజోలుకు చెందిన బాధిత మహిళ నక్కా దుర్గ బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. బెహ్రెయిన్‌లో ఆమె పడుతున్న కష్టాలను బంధువులకు తెలపడంతో వారు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి మైగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ చొరవతో దుర్గ బెహ్రెయిన్‌ నుంచి రాజోలుకు క్షేమంగా చేరుకుందని డీఆర్వో వీర్ల సుబ్బారావు, మైగ్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ మేనేజర్‌ గోళ్ల రమేష్‌ తెలిపారు.

నిందితుడి అరెస్టు

కాకినాడ క్రైం: తాళాలు బద్ధులు కొట్టి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ డెయిరీఫాంకు చెందిన దాసరి హరీష్‌ (25) పాత నేరస్తుడు. తాజాగా కాకినాడ టూ టౌన్‌, సర్పవరం, త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలువురి ఇళ్లు కొల్లగొట్టాడు. ఇతడిపై గతంలో 26 కేసులతో పాటు పోర్టు పీఎస్‌లో సస్పెక్ట్‌ షీటు ఉంది. టూ టౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడు, బృందం నిందితుడిని మంగళవారం నగరంలో పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.28 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మతిస్థిమితం కోల్పోయి కారులోనే ప్రయాణం

గండేపల్లి: కారులో వచ్చిన ఓ వ్యక్తి దాదాపు రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోవడంతో స్థానికులు స్పందించారు. అతడిని వివరాలు అడిగి బంధువుల వద్దకు చేర్చే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనను అతడి స్నేహితులు తీసుకువెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. ఆ గ్రామ శివారులోని డెక్కల పోలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో హైవేపై అలాగే ఉండిపోయింది. కొంత సమయానికి స్థానికులు ఆ కారును గమనించారు. అక్కడే నిలిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బంది, స్థానికుల సాయంతో కారును సమీపంలోని వేబ్రిడ్జి వద్ద ఖాళీ ప్రదేశంలోకి తరలించారు. అయితే కారులోని వ్యక్తి మంగళవారం ఉదయం బయటకు వచ్చి, సమీపంలోని బోర్‌ వద్ద స్నానం చేసి మళ్లీ కారులోనే ఉండిపోవడం, అప్పుడప్పుడు బయటకు వచ్చి అటు ఇటు తిరగడాన్ని స్థానికులు గమనించారు. కారు డోరును ఓపెన్‌ చేసి సదరు వ్యక్తిని వివరాలు అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు మంగళవారం రాత్రి కొందరు వచ్చి కారుతో పాటు ఆ వ్యక్తికి తీసుకువెళ్లిపోయారు. కాగా.. కారులోని వ్యక్తి కాకినాడలోని ప్రముఖ మెడికల్‌ కళాశాలకు చెందిన ఒక వైద్యుడని, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని సమాచారం. కారులో సుమారు నాలుగు రోజులుగా కారులో ప్రయాణం చేస్తూ ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కారులో ఒక మృత శునకం ఉందని, దాని నుంచి దుర్వాసన వస్తున్నప్పటికి అతను ఆ కారులో ఉండిపోయాడని, నా టామీ అంటూ శునకాన్ని తలుచుకుంటూ బాధపడినట్టు స్థానికులు తెలిపారు.

● తాళ్లూరులో ఓ వ్యక్తి కలకలం

● స్పందించిన స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement