● గల్లంతైన మత్స్యకారుల కోసం పిల్లల ఎదురుచూపులు
● ఆందోళనలో బాధిత కుటుంబాలు
● 12 రోజులుగా కానరాని ఆచూకీ
కొత్తపల్లి: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన బోటు యజమాని గరికిన సింహాద్రి, సూరాడ కోదండరావు, గంపల ప్రకాష్, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, మేరుగు నారాయణ, కందాల రాములు ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు 12 రోజులుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో ప్రతి క్షణం ఆశతో ఎదురుచూస్తూ ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో తండ్రి కోసం ఎదురుచూస్తున్న చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అంటూ పిల్లలు అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల్లులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారంటూ తోటి మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.
ఆందోళన చెందొద్దు
మత్స్యకారుల కుటుంబ సభ్యులను బుధవారం అధికారులు పరామర్శించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ కాకినాడ నుంచి కూడా అదే సమయంలో సముద్రంలో వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి చేరుకుంటున్నారన్నారు. అలాగే ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన గల్లంతైన మత్స్యకారులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఇంటికి చేరుతారని, అధైర్యపడవద్దని వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యురాలు, మాజీ ఎంపీ వంగా గీత ధైర్యం చెప్పారు. ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన బాధిత మత్స్యకార కుటుంబాలను బుధవారం ఆమె పరామర్శించారు. ఈ సంఘటనపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం మరింతగా గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా భారత నౌకాదళం, కోస్టుగార్డు దళాలను కోరారన్నారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి ఉమ్మిడి జాన్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ పాల్గొన్నారు.


