● కొడుకుతో వాగ్వాదమే కారణం
● ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు
తాళ్లరేవు: కొడుకుతో జరిగిన వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి కోరంగి నది(ఆత్రేయ గోదావరి)లో దూకేసిన ఘటన కలకలం రేపింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన అర్ధాని అనిల్వర్మ, అతని తల్లి రామలక్ష్మి ద్విచక్ర వాహనంపై కాట్రేనికోన వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అకస్మాత్తుగా బండి పైనుంచి దూకి, పక్కనే ఉన్న కోరంగి నదిలో దూకేసింది. అదే సమయంలో యానాం సావిత్రి నగర్ నుంచి సంగాడి ప్రసాద్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై తన అక్కను తీసుకుని కాకినాడ వెళ్తున్నాడు. వంతెన పైనుంచి చూడగా మహిళ (రామలక్ష్మి) నీటిపై తేలియాడుతూ కనిపించింది. అక్కడ చాలామంది జనం ఉండటంతో పాటు భవానీ మాలలో ఉన్న కారణంగా వెళ్లిపోదామని తొలుత అనుకున్నాడు. అయితే, తన అక్క చెప్పడంతో ప్రసాద్ బండి దిగి, కోరంగి వంతెన పైనుంచి నదిలో దూకాడు. అతడు పట్టుకునేలోపే రామలక్ష్మి పూర్తిగా నీరు తాగేయడంతో మునిగిపోయింది. అయినప్పటికీ ప్రసాద్ ప్రాణాలకు తెగించి మరీ నది లోపలకు వెళ్లి, ఆమెను బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో అతడి అరకాసు బంగారు ఉంగరం నదిలో పడిపోయింది. అయినప్పటికీ పట్టించుకోకుండా రామలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అనంతరం, ఆమెను 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సముద్రంలో వేట చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుకొనే ప్రసాద్ సాహసాన్ని పలువురు అభినందించారు. బంగారు ఉంగరం పోయినా తనకు బాధ లేదని, నిండు ప్రాణాన్ని కాపాడటం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రసాద్ తెలిపాడు.


