సాక్షి, అమలాపురం/కొత్తపేట: ‘పల్లెల రూపురేఖలు మార్చేస్తాం.. గ్రామీణ మౌలిక వసతులకు మహర్దశ తీసుకొస్తాం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తాం’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతనే లేదు. పల్లె పండుగ పేరుతో ఆర్భాటంగా ప్రకటనలు.. హడావుడిగా శంకుస్థాపనలు.. ఆ తర్వాత పనుల ఊసే లేదు. పల్లెల్లో అభివృద్ధి పండుగ తీసుకొస్తామని చెప్పిన పాలకులు ప్రచార పండుగకే పరిమితమయ్యారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖకు నిధులు సమకూర్చడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పల్లె పండుగ 3.0 ప్రకటనలకే పరిమితమవుతోంది.
రూ.78 కోట్ల పనులెక్కడ?
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పల్లె పండుగ 3.0 కింద ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.13 కోట్ల చొప్పున సుమారు రూ.78 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మంజూరైన పనుల్లో సుమారు 80 శాతం ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. కొన్నిచోట్ల శంకుస్థాపనలతోనే సరిపెట్టగా.. మరికొన్నిచోట్ల పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
ఎన్నికల ముందు హడావుడి.. ఆపై మౌనం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ అధికార పార్టీ నేతలు హడావుడి చేశారు. పల్లె పండుగ 3.0 పేరుతో పలుచోట్ల శంకుస్థాపనలు నిర్వహించారు. తీరా పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని, అందువల్ల పనులు వాయిదా వేయాల్సి వస్తోందంటూ కొత్త వాదన తెర పైకి తెస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందే పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. నెలల తరబడి ఎందుకు జాప్యం చేశారనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రచారానికి చూపిన ఉత్సాహం పనులు పూర్తి చేయడంలో మాత్రం కనిపించడం లేదు.
పాత బిల్లులు ఇవ్వకుండా కొత్త పనులెలా?
ఒకవైపు పల్లె పండుగ 3.0 పనులు ప్రారంభం కాకపోగా.. మరోవైపు గతంలో చేపట్టిన పల్లె పండుగ 2.0 పనులకు సంబంధించిన బిల్లులు కూడా పేరుకుపోయాయి. జిల్లాలో సుమారు రూ.106 కోట్ల వరకు బకాయిలున్నట్లు సమాచారం. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బిల్లులే అందని పరిస్థితుల్లో కొత్త పనులు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే కారణంతో పల్లె పండుగ 3.0 పనులపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.
అసంపూర్తి పనులతో అవస్థలు
ఆత్రేయపురం మండలం ర్యాలిలో భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.
ఇదే మండలం వాడపల్లి – మెర్లపాలెం మధ్య పూర్తి కాని రోడ్డు పనులు ప్రభుత్వ ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాటుతున్నాయి.
సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం ఏటిగట్టు నుంచి అప్పనరామునిలంక వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ 3.0 కింద మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదు.
అల్లవరం మండలం తూర్పులంకలో రూ.49 లక్షలతో బీటీ (తారు) రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ పనులను ప్రారంభించడానికి సర్కారు వారికి ఇంకా ముహూర్తమే కుదరలేదు.
ఇలా జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. పల్లెల్లో అభివద్ధి పండుగ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలోకి రాకపోవడంతో ప్రజల్లో అసంతప్తి వ్యక్తమవుతోంది.
ప్రచార ఆర్భాటానికే పల్లె
పండుగ 3.0 పరిమితం
ఇంకా ప్రారంభం కాని
80 శాతం పనులు
ఎన్నికల ముందు హడావుడిగా
శంకుస్థాపనలు
పల్లె పండుగ 2.0 బిల్లులు
చెల్లించని ప్రభుత్వం
జిల్లాలో రూ.106 కోట్ల వరకు పెండింగ్
ఫలితంగా ముందుకు రాని కాంట్రాక్టర్లు


