● జిల్లాలో కనిపించని తుపాను ప్రభావం
● భారీ వర్షాలు, ఈదురుగాలులు లేకపోవడంతో ఊరట
● అయినప్పటికీ రైతులను వీడని ఆందోళన
సాక్షి, అమలాపురం: తుపాను వస్తోందంటేనే వణికిపోయే పరిస్థితి.. అందులోనూ వరుస తుపానుల దెబ్బతో కోలుకోలేకపోతున్న కోనసీమ రైతులకు మరో ముప్పు పొంచి ఉందన్న వాతావరణ హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆక్వాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న ఆందోళన జిల్లాలో నెలకొంది. అయితే, గురువారం సాయంత్రం వరకూ జిల్లాలో తుపాను ప్రభావం పెద్దగా కనిపించ లేదు. వాతావరణంలో మార్పులు మినహా చెప్పుకోదగిన వర్షాలు, గాలులు లేకపోవడంతో ప్రస్తుతానికి తుపాను ముప్పు తప్పినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురవకూడదని రైతులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
అర్నబ్, మురసు తుపాన్లు ఇప్పటికే కోనసీమ వ్యవసాయ, ఉద్యాన రంగాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి, నీట మునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు కొబ్బరి చెట్లు నేల కూలడంతో పాటు, మొవ్వులు విరిగి రైతులు ఏళ్ల తరబడి ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అరటి, ఇతర ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది.
వర్షం పడినా కష్టమే..
ప్రస్తుతం వరి కోతలు, నూర్పిళ్లకు సంబంధించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నేలకొరిగిన వరి చేలను కాపాడుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తే కోతలకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు కోసిన ధాన్యం కూడా తడిసిపోయే ప్రమాదం ఉంది. తేమ కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బ తినడంతో పాటు కొనుగోళ్లలోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు కొబ్బరి, ఇతర ఉద్యాన పంటల రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. తుపానుల కారణంగా దెబ్బ తిన్న తోటలు ఇంకా కోలుకోలేదు. ఈ తరుణంలో బలమైన గాలులు వీస్తే మిగిలిన చెట్లు, పంటలకూ నష్టం వాటిల్లుతుందనే భయం వారిని వెంటాడుతోంది.
తుపాను గండం తప్పినా..
ఆక్వాన్ తుపాను కదలికలు, తీరం వైపు దాని ప్రయాణంపై వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతానికి ప్రభావం కనిపించకపోయినా వర్షాల విషయంలో మాత్రం వారిని ఆందోళన వీడటం లేదు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలంగా మారితేనే పంటలను కాపాడుకోగలమని భావిస్తున్నారు. తుపాను ముప్పు కంటే దాని ప్రభావంతో కురిసే వర్షాలే తమకు ఎక్కువ నష్టం కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు.
ఒడిశా వైపు వెళ్తున్న తుపాను


