అమలాపురం రూరల్: నూతన జిల్లా ఆవిర్భావం అనంతరం ఏర్పడిన కోనసీమ జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు శుక్రవారం జరగనుంది. జెడ్పీ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ వైఖోం నైడియాదేవి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం అమలాపురంలోని జెడ్పీ కార్యాలయంలో సీఈఓ వసంత మాధవి ఆధ్వర్యాన అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 19 మంది జెడ్పీటీసీ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేతులెత్తే విధానంలో జరుగుతుందని సీఈఓ తెలిపారు. అనంతరం, వారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్పర్సన్ ఎవరనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. మామిడికుదురు, ఐ.పోలవరం నుంచి జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన గొల్లపల్లి అమూల్య, బీర సత్యకుమారి మధ్య పోటీ ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సవరణల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ మేరకే తదుపరి ప్రక్రియ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల నియమావళి
విధిగా పాటించాలి
కొత్తపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు విధిగా నియమావళి పాటించాలని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. కొత్తపేటలో నామినేషన్ల ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనల ప్రకారమే లోపలకు ప్రవేశించేలా చూడాలని సూచించారు. ఎక్కడా జనం అనవసరంగా గుమిగూడకుండా నియంత్రించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు, బెదిరింపులు, ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక అప్రమత్తత పాటించాలన్నారు. అవాంఛనీయ పరిస్థితి తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మీనా స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎస్సై జి.సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీఎల్పీఓగా సూరపరాజు
అమలాపురం రూరల్ : అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి(డీఎల్పీఓ)గా రుద్రరాజు ఎస్ఎస్ సూరపరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మలికిపురం డిప్యూటీ ఎంపీడీఓగా పని చేస్తున్న ఆయనకు డీఎల్పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎల్పీఓగా బాధ్యతలు స్వీకరించిన సూరపరాజును విశ్రాంత డీఎల్పీఓ పి.బొజ్జిరాజు, డిప్యూటీ ఎంపీడీఓలు టీడీఏ శాస్త్రి, టి.అచ్చిరాజు, గరిమెళ్ల రవి, పలువురు పంచాయతీ కార్యదర్శులు అభినందించారు.
మేయర్ బరిలో పది మంది..
కాకినాడ లీగల్: నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల తుది బరిలో పది మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి మొత్తం 21 మంది నామినేషన్లు వేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ సెట్లు వేయడంతో మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21 మందిలో 11 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పోటీలో పది మంది మిగిలారు. వీరిలో వైఎస్సార్ సీపీ నుంచి కాద సత్యశ్రీ, ఆకుల భవాని (జనసేన), కట్టా పద్మజ (కాంగ్రెస్), వాసంశెట్టి ఆశాకిరణ్ (బీఎస్పీ), గొలుసు భవాని (తెలుగు నవగర్జన), మామిడి స్వాతి (తెలుగు జనతా పార్టీ) ఉన్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా చింతా మైత్రి అద్వైత, టేకుమూడి సాయిలక్ష్మి, పిల్లి లహరి, హఫీజున్నిసా మొహమ్మద్ బరిలో నిలిచారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ఏలూరి నాగకన్య, కంచి వేనిశ, కడిలి ఈశ్వరి, కసిరెడ్డి వినూష, గుత్తుల వెంకట శుభ, చొల్లంగి సుబ్బలక్ష్మి, పెంకే గౌరీ మనోహరి, లక్ష్మి ప్రసింగి, పసుపులేటి వెంకటలక్ష్మి, వాసంశెట్టి సత్య, అందె హరిక ఉన్నారు.


